Influenza: అల్లాడిస్తున్న H3N2.. రాష్ట్రాలను హై అలెర్ట్ చేసిన కేంద్రం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

|

Mar 11, 2023 | 4:12 PM

కరోనా నుంచి బయటపడిన ప్రపంచాన్ని మరో ముప్పు.. హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ రూపంలో వెంటాడుతోంది. ఇప్పటికే దేశంలో ఇద్దరిని బలితీసుకుంది. దీంతో ప్రజలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇంతకీ ఈ రోగం వస్తే మందులు ఉన్నాయా? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి.

Influenza: అల్లాడిస్తున్న H3N2.. రాష్ట్రాలను హై అలెర్ట్ చేసిన కేంద్రం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Awareness regarding adherence to respiratory and hand hygiene is important. ( Image Source : Representational Image/Getty )
Follow us on

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీని కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందన అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ వంటివి ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. ఓవైపు వైద్య నిపుణులు ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నప్పటికీ.. రెండు నెలలుగా విపరీతంగా పెరుగుతున్న కేసులతోపాటు మరణాలు కూడా నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా-ఏ ఉపరకమైన హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా భారత్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా ధ్రువీకరించింది. కర్నాటక , హర్యానా రాష్ట్రాల్లో ఈ వైరస్‌తో రెండు మరణాలు నమోదు కావడంతో అలర్ట్‌ ప్రకటించారు.

కోవిడ్‌లాంటి లక్షణాలతో ఫ్లూ విస్తరిస్తుండటంతో మళ్లీ కరోనా తరహా భయం అందరిలో మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. వైరల్ ఫీవర్స్, దగ్గు లాంటి లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ చిన్న పిల్లల్లో సోకితే ఇక అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. లంగ్స్ ఇన్ఫెక్షన్ సోకి.. ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. హఠాత్తుగా వ్యాపిస్తోన్న ఈ జ్వరం, దగ్గు కేసులకు ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌3ఎన్‌2 వైరస్ కారణమంటున్నారు వైద్యులు. ఇతర ఇన్‌ఫ్లూయెంజా సబ్ వేరియంట్ల కన్నా దీని వల్లే ఎక్కువ మంది రోగులు దవాఖానాలో చేరుతున్నారు.

దగ్గు, వికారం, వాంతులు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, జ్వరం ఈ ఇన్‌ఫ్లూయెంజా హెచ్‌3ఎన్‌2 వైరస్ లక్షణాలు. ఈ వ్యాధి సోకిన రోగుల్లో చాలా మందిలో తెల్లరక్త కణాలు పడిపోతున్నాయి. అంతే కాకుండా రక్తంలో ఇన్ఫెక్షన్ సోకుతోంది. కొంతమందికి లంగ్స్ పై ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలతో పాటు చాలా మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. కేసులు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు ఒక కారణం అయితే.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం రెండవది. ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తుందని, ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్‌లో ఉత్పరివర్తనలు చోటు చేసుకుంటాయనేది నిపుణుల అభిప్రాయం.

H3N2 వైరస్ సోకితే కనీసం వారం రోజుల పాటు లక్షణాలు కనిపిస్తాయి. ఇక ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నవారికి మరికొన్ని ఎక్కువ రోజులు ప్రభావం ఉంటుంది. వృద్ధులు, చిన్నారుల్లో మరింత ఎఫెక్ట్ చూపించనుంది. కొన్ని సందర్భాల్లో న్యూమోనియాకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఈ వైరస్‌ సోకిన వారు పారాసిట్‌మాల్‌, బ్రూఫిన్‌ లాంటి ట్యాబ్‌లెట్లను వినియోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీ బయాటిక్స్‌తో పాటు ఓఆర్‌ఎస్‌, పండ్ల రసాలు, ఎక్కువగా నీళ్లు తీసుకోవాలనేది డాక్టర్ల సలహా. ముఖ్యంగా చిన్నారులకు ఈ లక్షణాలు ఉంటే స్కూళ్లకు పంపకపోవడం మంచిదంటున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలన్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి, ముక్కును టిష్యూ/మోచేతిని అడ్డుపెట్టాలి.   చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం.. పబ్లిక్‌లో ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి