ఓ పదంతస్తుల బిల్డింగ్ ఎక్కాలంటేనే అమ్మో అంటాం. అక్కడి నుంచి ఎక్కడ కిందపడిపోతామోనని భయపడిపోతాం. మరి ఆకాశం నుంచి దూకాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అవును.. ఆ సాహసమే చేశాడు తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా(Dadisetti Raja)కుమారుడు శంకర్ మల్లిక్. ఆ కుర్రాడు చేసిన ఫీట్‌ను చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఈ ఫీట్‌ను ఎలా చేశాడా అని ఆశ్చర్యంపోతాం. ఇంతకూ శంకర్ మల్లిక్ చేసిన ఫీట్ ఏంటనేనా మీ సందేహం? అక్కడికే వస్తున్నాం. ఉన్నత చదువుల కోసం దుబాయ్(Dubai )వెళ్లిన మల్లిక్‌కు చిన్నప్పటి నుంచీ సాహసాలంటే కాసింత ఆసక్తి ఎక్కువ. క్రీడాకారుడు కూడా కావడంతో మరింత ఉత్సాహంగా ఉండేవాడు. అబుధాబిలో జరుగుతున్న స్కైడైవింగ్ విన్యాసాల్లో తమ కళాశాల తరఫున పాల్గొన్న మల్లిక్.. వేల అడుగుల ఎత్తు నుంచి దూకి.. గాల్లో విన్యాసాలు చేశాడు. గాలిలో చక్కెర్లు కొడుతూ చేసిన విన్యాసం వైరల్‌గా మారింది. ఇదంతా ట్రైనర్ పర్యవేక్షణలోనే చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి పారాచూట్ సాయంతో దూకడానికి ఎంతో గుండె ధైర్యం ఉండాలి. చిన్న వయస్సులోనే ఇలాంటి సాహసోపేత క్రీడల్లో పాల్గొంటున్న మల్లిక్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు ఏపీ ప్రజలు. మల్లిక్ సాహసం ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు. ఇలాంటి సాహసాలతో యువతలో స్ఫూర్తి నింపాడని కొనియాడారు. మల్లిక్ స్కై డైవింగ్(Skydiving)ను అటు కళాశాల యాజమాన్యం కూడా ప్రశంసించింది. స్కైడైవింగ్ చేయడం ఆనందంగా ఉందన్నాడు శంకర్ మల్లిక్. గాల్లో చక్కర్లు కొట్టడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందన్నాడు.
Also Read: ఓన్లీ రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు.. కౌంట్ చేయలేక కళ్ళు తేలేసిన షోరూం స్టాఫ్!