
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు ఆపద మొక్కుల స్వామే కాదు, వడ్డీ కాసుల వాడు కూడా. అందుకే ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకునే భక్తులు వెంకన్న దర్శనానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. రెప్పపాటు శ్రీవారి దర్శనం కలిగితే చాలు మహాభాగ్యంగా భావిస్తారు. ఈ క్రమంలోనే దాతలుగా మారి శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు, టీటీడీ తాజాగా చేసిన ప్రకటనతో పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించారు. విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలపై టీటీడీ కొత్త పాలసీని తీసుకువచ్చింది. భక్తులకు ఇచ్చే ప్రివిలేజ్‌లపై అధ్యయనం చేసి మార్పులు చేసేందుకు బోర్డు సభ్యులతో కమిటీ వేసిన టీటీడీ, ఈ మేరకు దాతల సౌకర్యాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగానే ఈ నెల 14న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కొత్త పాలసీని తీసుకువచ్చారు. ఇందుకు బోర్డు ఆమోదం తెలపడంతో.. ఈ నెల 14 అర్ధరాత్రి వరకే విరాళాలు సమర్పించే భక్తులకు పాత పద్ధతి వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడి కోట్ల రూపాయల విరాళాలు సమర్పించారు. కొందరు భక్తులు నేరుగా టీటీడీని సంప్రదించి విరాళాలు అందజేయగా, మెజారిటీ భక్తులు ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా దాతలుగా పేర్లు నమోదు చేసుకున్నారు.
కొత్త నిర్ణయం ప్రకారం ఈ 15 నుంచి దాతలకు లభించే సౌకర్యాలు ఇవే :
రూ. 1 లక్ష విరాలంగా ఇచ్చిన భక్తులకు ఏడాదికి ఒకసారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్.
రూ. 2 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా దర్శనం.
రూ. 3 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా, మరోసారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం.
రూ. 4 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి రెండుసార్లు సుపథం ద్వారా దర్శనం.
రూ. 5 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి మూడుసార్లు సుపథం ద్వారా దర్శనం.
రూ. 10 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి ఒకసారి సుపథం ద్వారా, మరోసారి వీఐపీ బ్రేక్ దర్శనం.
రూ. 15 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం, రెండుసార్లు సుపథం ద్వారా దర్శనం.
రూ. 20 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి రెండుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, మూడుసార్లు సుపథం ద్వారా దర్శనం.
రూ. 25 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి మూడుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, మూడుసార్లు సుపథం ద్వారా దర్శనం.
రూ. 50 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి మూడుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ద్వారా దర్శనం. అలాగే మొత్తం 10 సుప్రభాత సేవ టికెట్లు కేటాయిస్తారు (ఏడాదికి రెండు చొప్పున వినియోగించుకోవచ్చు).
రూ. 75 లక్షలు విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి మూడుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ద్వారా దర్శనం. మొత్తం 12 సుప్రభాత సేవ టికెట్లు కేటాయిస్తారు (ఏడాదికి రెండు చొప్పున వినియోగించుకోవచ్చు).
రూ. 1 కోటి విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి మూడుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ద్వారా దర్శనం. మొత్తం 20 సుప్రభాత సేవ టికెట్లు కేటాయిస్తారు (ఏడాదికి రెండు చొప్పున వినియోగించుకోవచ్చు).
రూ. 1.5 కోటి అంతకంటే ఎక్కువ విరాలంగా ఇచ్చే భక్తులకు ఏడాదికి నాలుగు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనం, నాలుగు సార్లు సుపథం ద్వారా దర్శనం. మొత్తం 40 సుప్రభాత సేవ టికెట్లు కేటాయిస్తారు (ఏడాదికి రెండుసార్లు, రెండు టికెట్ల చొప్పున వినియోగించుకోవచ్చు).
విరాళాలు అందించిన దాతల వివరాలు:
ఆఫర్ ముగుస్తుందని విరాళాల వెల్లువ:
ఈ నెల 14న తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి డొనేషన్ స్కీమ్‌లో తీసుకొచ్చిన మార్పులను ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో టీటీడీ నిర్ణయం వెలువడగానే, సమయం లేదనుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. 14వ తేదీ అర్ధరాత్రి నుంచే కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని ఈఓ ప్రకటించడంతో దాతలుగా మారేందుకు భక్తులు పోటీపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వచ్చిన విరాళాలు టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించాయి. కేవలం 10 గంటల సమయం మాత్రమే ఉండటంతో భక్తులు టీటీడీ ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ నెల 14 ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 96.98 కోట్ల విరాళాలు వచ్చాయి.
సామాన్య భక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో ఉంచుకుని డోనర్ ప్రివిలేజెస్‌లో మార్పులు చేసిన టీటీడీ బోర్డు, సదుపాయాలను కొంతమేర తగ్గించి కొత్త డోనర్ పాలసీని ప్రవేశపెట్టింది. కాగా, జూన్ 26వ తేదీ వరకు టీటీడీలో మొత్తం 1,97,888 మంది భక్తులు దాతలుగా నమోదు చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.