
ఇది కందిరీగల గూడో లేక తేనెతుట్టెనో అనుకునేరు. విషపుటీగల గూడు చిన్నపాటి కందిరీగల్లా కనిపించే ఈ విషపుటీగలు చెట్లపై మట్టితో గుండ్రటి ఆకారంలో గూళ్లు కట్టుకుంటాయి. వాటి గూడు ఉన్న ప్రాంతంలో ఏదైనా కదలిక జరిగితే.. ఇవన్నీ ఒక్కసారిగా దాడి చేయడానికి దూసుకొస్తాయి. ఎంత జాగ్రత్తగా పారిపోయినా వీటి దాడి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. తాజాగా ఇలాంటి విషపుటీగల ఉనికి నరసాపురం పరిసర ప్రాంతాలతో పాటు తీర గ్రామాల్లో గుర్తించారు. పేరుపాలెం సౌత్ పరిధిలోని ఉంగరాలవారి మెరక వద్ద ఓ కొబ్బరి చెట్టుకు పెద్ద గూడు కనిపించింది. వేములదీవి పడమర ప్రాంతంలోని కాపులకొడప గ్రామంలో మూడు రోజుల క్రితం వీటి దాడికి గురైన ఓ దంపతులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటీవలి కాలంలో పీఎంలంక, పేరుపాలెం ప్రాంతాల్లో ఈ విషపుటీగల కాటుకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. వారం క్రితం నరసాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రాంగణంలో పనిచేస్తున్న సత్యనారాయణ అనే ఉద్యోగి కూడా వీటి దాడికి గురై రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పేరుపాలెం, కేపీపాలెం, తూర్పుతాళ్లు వంటి గ్రామాల్లో కూడా గతంలో పలువురు వీటి దాడికి గురై గాయపడ్డారు. సునామీ తర్వాత ఈ విషపుటీగలను నిర్మూలించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఆ సమయంలో రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్‌జీసీ సంయుక్తంగా కృషి చేసి పగటి పూట గూళ్లను గుర్తించి రాత్రి వేళల్లో విషరసాయనాలు చల్లి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌తో వాటిని దహనం చేశారు. ప్రస్తుతం మళ్లీ ఇవి కనిపిస్తున్నప్పటికీ, నిర్మూలన చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నిర్మూలన చర్యలు చేపట్టామని. ఎక్కడైనా ఈగల ఉనికి గుర్తించిన వెంటనే రెవెన్యూ కార్యాలయానికి సమాచారం అందించాలని నరసాపురం ఆర్డీవో దాసి రాజు సూచించారు. ఈ విషపుటీగలను వెస్పా అఫినిస్ లేదా లెస్సర్ బ్యాండెడ్ హార్నెట్ అంటారని నిపుణులు చెబుతున్నారు. వీటి విషంలో హీమోలైసిన్లు, న్యూరోటాక్సిన్లు ఉంటాయట. కాటు వేసిన ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, వాపు కలుగుతాయి. కొన్నిసార్లు ఉబ్బసం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దాడికి గురైన వెంటనే చికిత్స పొందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.