ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉండే పేరెంట్స్ కమిటీ స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
స్కూళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు పేరెంట్స్ కమిటీలు అమల్లో ఉన్నాయి. అయితే తాజాగా వీటిలో స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం ఈ మేనేజ్‌మెంట్ కమిటీ విధులు.
ఇక ఆగస్టు 8వ తేదీన ఇందుకు సంబంధించి ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే రోజు కమిటీ ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు తొలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్కూల్ పేరెంట్స్ కమిటీల పదవి కాలం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల గురించి మాట్లాడారు. వీటి పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్స్ నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..