Tirumala Temple: వారాంతం కావడంతో తిరుమలకొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 29 కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. ఒక్కో కంపార్ట్ మెంటులో 450 మంది భక్తుల చొప్పున 29 కంపార్ట్ మెంట్లలో 13050 మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట నారాయణగిరిలోని 9 షెడ్లలో 9వేల మంది భక్తులు వేచి ఉన్నారు. నారాయణగిరి నుండి 400 మీటర్ల క్యూలైన్ లో 4వేల మంది భక్తులు, ఎంబీసీ నుండి లేపాక్షి వరకు 900 మీటర్ల క్యూ లైన్ లో 7వేల మంది భక్తులు, లేపాక్షి నుండి ఆస్థాన మండపం వరకు ఉన్న 850 మీటర్ల జిగ్ జాగ్ క్యూలైన్లలో 5వేల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనాని దాదాపు 25 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తిరుమలలో గదుల కోసం భక్తులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది భక్తులు టీటీడీ యాత్రికుల వసతి సముదాయాల్లో బస చేయగా, మరికొంత మంది భక్తులు షెడ్ల కింద సేదతీరుతున్నారు.