కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్ వచ్చింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డులో జరుగుతున్న సుందరీకరణ ( బ్యూటిఫికేషన్) పనులను జెఈవో శ్రీమతి సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. ఘాట్ రోడ్లు, తిరుమల లో భక్తులకు ఆహ్లాదం కలిగించే విధంగా పూల మొక్కలతో సుందరీకరించాలని ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అటవీశాఖ అధికారులు పనులను ప్రారంభించారు. అప్ ఘాట్ రోడ్డులో జరుగుతున్న పనులను జెఈవో శ్రీమతి సదా భార్గవి పరిశీలించారు. ఘాట్ లో కొండ చరియలు , రాతి బండలు కనిపించకుండా ఉండేలా వివిధ రకాల పూల మొక్కలు వేలాడదీసి పెంచే సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న పనుల వివరాలు ఆమె తెలుసుకున్నారు. అవసరమైన చోట భూమి చదువు చేసి తగిన పూల మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో వీలైనంత త్వరగా పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి వినాయక స్వామి గుడి వరకు ప్రత్యేక డిజైన్ లతో మొక్కల పెంపకం గురించి అధికారులతో చర్చించారు. ఘాట్ రోడ్డులో ఆమె మొక్కను నాటారు.
Also Read: Kadapa district: రోజుకు 48 బాటిల్సే.. సీసా అందుకుంటే ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్.. ఏంటి గురూ ఇది
New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి