తిరుమల కొండపై మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఎంతలా అంటే.. భక్త సునామీ అన్న స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొండకు ప్రవాహంలా భక్తులు చేరుకుంటున్నారు. అయితే అధికారుల సూచనలు, పర్యవేక్షణ నేపథ్యంలో ప్రజంట్ కొంతమేర ఒత్తిడి తగ్గింది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 20 గంటల సమయం పడుతుంది. టీబీసీ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారికి రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది. వెంకన్నను 86,188 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,032 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే.. ఎంత ఆలస్యం అయినా.. కొండపై ఉన్న భక్తులందరికి దర్శనం కల్పిస్తామంటున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. భక్తులెవరినీ వెనక్కు వెళ్లిపొమ్మని చెప్పలేందంటున్నారు. అయితే రానున్న ఒకట్రెండు రోజుల్లో తిరుమల రావాలనుకున్న వాళ్లు మాత్రం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ఇక భక్తులకు క్యూలైన్లలో అసౌకర్యం కలుగకుండా విశ్రాంతి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నారు.
మరోవైపు.. విఐపీ బ్రేక్ దర్శనం టైమ్‌ను ఉదయం 10 గంటలకు మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. త్వరలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. కొండపైకి వచ్చే ప్రత్యేక దర్శనం భక్తులకు తిరుపతిలో రూమ్‌లు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.
తిరుమల శ్రీవారి దివ్య వైభవం చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు, ఎంత చూసినా తనివి తీరనిది శ్రీవారి దివ్య దర్శనం. అలాంటి శ్రీనివాసుడి దివ్య వైభవం, మన కళ్ల ముందుకే వస్తే, ఆ ఆనందమే వేరు. వివిధ కారణాలతో తిరుమల రాలేకపోతున్న భక్తుల కోసం శ్రీవారినే మన దగ్గరకు తీసుకొస్తోంది టీటీడీ. అందుకోసం దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాలను కండక్ట్ చేస్తోంది. రెండేళ్ల కరోనా పాండమిక్ గ్యాప్ తర్వాత ఫస్ట్‌టైమ్ నెల్లూరులో వైభవోత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం, నెక్ట్స్ వెన్యూగా హైదరాబాద్‌ను ఎంచుకుంది టీటీడీ. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈనెల 11నుంచి 15వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరగనున్నాయ్. తిరుమలలో ప్రతిరోజూ ఏవిధంగా స్వామివారికి సేవలు జరుగుతాయో అదేవిధంగా జరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..