గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈ వాహన సేవలు దర్శిస్తే సకల శుభాలే..!
Sri Govindaraja Swamy Brahmotsavam 2026: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. అద్భుతమైన గోపురాలు, శిల్పకళా వైభవంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 22న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

శ్రీ గోవింద రాజస్వామి స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple) తిరుపతి నగరంలోని అత్యంత పురాతన వైష్ణవ ఆలయాలలో ఒకటి. దాదాపు వెయ్యేళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం అద్భుతమైన గోపురాలు, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక మహిమతో భక్తులను ఆకట్టుకుంటుంది. Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మే 22న అంకురార్పణతో ఘనంగా ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏమిటి?
భారతీయ ఆలయ సంప్రదాయంలో సంవత్సరానికి ఒకసారి జరిగే మహోత్సవాలను “బ్రహ్మోత్సవాలు”గా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ ఉత్సవాలను స్వయంగా బ్రహ్మదేవుడు ప్రారంభించాడని విశ్వసిస్తారు. అందుకే వీటికి “బ్రహ్మోత్సవాలు” అనే పేరు వచ్చింది.
పుణ్యఫలాలను ప్రసాదించే వేడుకలు
సాధారణంగా ఈ ఉత్సవాలు పది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ప్రతి రోజూ స్వామివారు వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మోత్సవాలను మహాయజ్ఞంతో సమానమైన పుణ్యఫలాలను ప్రసాదించే వేడుకలుగా పేర్కొన్నారు. అందుకే ఉత్సవాల ముగింపులో పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం, అవభృథ స్నానం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
గోవిందరాజ స్వామి ప్రత్యేకత
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా లేదా తరువాత గోవిందరాజ స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా భావిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం గోవిందరాజ స్వామిని శ్రీనివాసుడి అన్నగా భావిస్తారు.
ఒక పురాణగాథ ప్రకారం, శ్రీనివాసుడి వడ్డికాసులను కొలుస్తూ అలసిపోయిన గోవిందరాజ స్వామి, తల కింద “కుంచం” అనే కొలిచే పాత్రను పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడని చెబుతారు. అందుకే గర్భగుడిలో స్వామివారు శయన భంగిమలో దర్శనమిస్తారు.
2026 శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్
- మే 22, శుక్రవారం.. సేనాపతి ఉత్సవం.. అంకురార్పణ
- మే 23, శనివారం.. ఉదయం తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం.. రాత్రి పెద్దశేష వాహనం
- మే 24, ఆదివారం.. ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
- మే 25, సోమవారం.. ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
- మే 26, మంగళవారం.. ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
- మే 27, బుధవారం.. ఉదయం మోహిని అవతార ఉత్సవం (పల్లకిలో), రాత్రి గరుడ వాహనం
- మే 28, గురువారం.. ఉదయం హనుమద్ వాహనం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజ వాహనం
- మే 29, శుక్రవారం.. ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
- మే 30, శనివారం.. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
- మే 31, ఆదివారం.. ఉదయం పల్లకి ఉత్సవం, చక్రస్నానం, తీర్థవారి అవభృథ స్నానం, సాయంత్రం తిరుచ్చి ఉత్సవం
రాత్రి ధ్వజావరోహణం
మే 31 రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ పవిత్ర వేడుకల సమయంలో ముక్కోటి దేవతలు భూలోకానికి విచ్చేస్తారని భక్తుల విశ్వాసం. అందువల్ల ఈ రోజులలో స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని అంటారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
