Tirumala: తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని(Srivenkateswara swami) దర్శనం చేసుకునే భక్తులు కొంతమంది కొండమీదకు వెళ్ళడానికి వాహనాలను ఆశ్రయిస్తే.. మరికొందరు నడకదారిని వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. తిరుమల గిరికి చేరుకోవడానికి అలిపిరి (alipiri), శ్రీవారి మెట్టు(srivari mettu) ప్రస్తుతం ఈ రెండు నడకదారి మార్గాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ నడకదారిని వెళ్లే సామాన్య భక్తులు..తమ వస్తుసామాగ్రిని బ్యాగుల్లో భద్రపరిచి.. టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్ ప్రాంతాల్లో డిపాజిట్ చేస్తారు. అనంతరం నడకదారిలో పయనిస్తూ.. స్వామివారిని దర్శించుకోవడానికి కొండమీదకు చేరుకుంటారు. అయితే తాజాగా తిరుమలలో నడకదారి భక్తుల బ్యాగుల మిస్సింగ్ కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళ్తే..
శ్రీవారిమెట్టు మార్గంలో నడకదారిని వెళ్లే భక్తులు ఉదయం 7 గంటలకు తమ బ్యాగులను డిపాజిట్ చేశారు. సుమారు 200 మందికిపైగా భక్తులు తమ బ్యాగులను డిపాజిట్ చేసి.. మెట్ల మార్గం ద్వారా కొండమీదకు చేరుకున్నారు. అనంతరం తమ బ్యాగులను తీసుకోవడానికి కొండమీద టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అయితే తమ బ్యాగులు ఇంకా కొండమీదకు చేరుకోలేదని తెలియడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ బ్యాగులు తమకు తెచ్చి ఇవ్వాలంటూ అధికారులను నిలదీశారు. అయితే కొండ కింద డిపాజిట్ చేసిన చాలామంది భక్తుల బ్యాగులు యథావిధిగా కొండమీదకు చేరుకుంటున్నాయి. కేవలం కొందరి బ్యాగులే మిస్ కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బ్యాగులు తమకు ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..