
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి మీద తన అపారమైన భక్తిని చాటుకున్నారు హైదరాబాద్‌కు చెందిన కె. దీపక్ అనే భక్తుడు. గురువారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న ఆయన.. అమ్మవారికి 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, విలువైన రాళ్లతో అలంకరించిన జత కర్ణ పత్రములను భక్తితో సమర్పించారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ. 23 లక్షలుగా టిటిడి అధికారులు వెల్లడించారు. అమ్మవారి దర్శనం పూర్తయ్యాక దాత కె. దీపక్ ఈ కర్ణపత్రములను టిటిడి అధికారులకు అధికారికంగా అందజేశారు.
ఆలయ సంప్రదాయం ప్రకారం టిటిడి అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. భక్తులు సమర్పించే కానుకలతో ఆలయ ఆభరణాల సంపద రోజురోజుకీ పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా టిటిడి అధికారులు మాట్లాడుతూ, భక్తుల విశ్వాసం, నమ్మకానికి ప్రతీకగా ఇలాంటి విరాళాలు నిలుస్తాయని పేర్కొన్నారు. దాతలు అందజేసే బంగారు ఆభరణాలను ఆలయ నిబంధనల ప్రకారం భద్రంగా భద్రపరచి, అవసరమైన సందర్భాల్లో అమ్మవారి అలంకరణలో వినియోగిస్తామని తెలిపారు.