Girls Missing Tirupati: తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన చంద్రగిరి సాంప్రదాయ పాఠశాల విద్యార్థుల మిస్సింగ్ కేసుపై తిరుపతి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈరోజు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వివరాలను వెళ్లడించారు. విద్యార్థులు గోడ దూకి పారిపోవడంతో అవాక్కయ్యామని చెప్పారు ఎస్పీ. విద్యార్థినులు మొబైల్ వాడటంతో సాంప్రదాయ పాఠశాల యాజమాన్యం మందలించిందనీ, ఇంట్లో తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారనే భయంతో ముంబైకు పారిపోయారని తెలిపారు. విద్యార్థినులు రేణిగుంట నుండి మహారాష్ట్ర కొల్హాపూర్ కు రైలులో వెళ్లిపోయారనీ, వారి దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో రైల్వే స్టేషన్ లోని నిద్రించారని చెప్పారు.
తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి రూ.వెయ్యి అడగడంతో తమకు క్లూ దొరికిందనీ, ముంబైలో విజయవాడ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ చెందిన మోపిదేవి శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యార్థులను చేరదీసి పోలీసులకు సమాచారమిచ్చి తమకు సహాయం చేశారని వెల్లడించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. నలుగురు విద్యార్థులు మూర్ఖంగా వ్యవహరించి ఏమీ ఆలోచించకుండా గోడదూకి పారిపోయారనీ, విద్యార్థులెవ్వరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు ఎస్పీ. విద్యార్థులకు ఏమైనా సమస్య ఉంటే తల్లిదండ్రులతో, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలనీ, ఇలాంటి మూర్ఖపు చర్యలకు పాల్పడితే అసాంఘిక శక్తులు విదేశాలకు అమ్మేసే ప్రమాదముందని హెచ్చరించారు. సాంప్రదాయ పాఠశాలలో వేధింపులపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదనీ, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.