ఏదైనా చేయాలి తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బులు సంపాదించాలి. ఇదిగో ఈ అత్యాశే మనిషి పాతాలానికి తొక్కేస్తుంది. కష్టపడి పనిచేయాల్సింది పోయి ఈజీ మనీ కోసం ఆరాటపడుతున్నారు. దొంగ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఓ బాగోతమే వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకుని అడ్డ దారి తొక్కిన కొందరు ప్రస్తుతం జైలు ఊసలు లెక్కిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు ఫేస్‌బుక్ ద్వారా తిరుపతిలోని రమేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇంట్లో షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. అయితే ఇందులో నష్టం వచ్చింది. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తప్పుడు మార్గం కోసం వెతికారు. దొంగ నోట్లను ముద్రించడం మొదలు పెట్టారు.
దొంగ నోట్లను ఎలా ముద్రించాలన్న విషయాలను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు. ఇందుకు రమేష్ భార్య సంధ్య, కుమార్తె ఇషా సహాయం చేశారు. తిరుపతి పట్టణంలో నోట్ల ముద్రణకు కావాల్సి వస్తువులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎంచక్కా ఇంట్లోనే నోట్లను ముద్రించడం మొదలు పెట్టారు. ఇక ముద్రించిన నోట్లను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు.. శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, పుత్తూరులో వస్తువులను కొనుగోలు చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఇషా పుత్తూరు పట్టణం మండివీధిలోని కొన్ని దుకాణాల్లో రూ. 500 నోట్లు ఇచ్చిన వస్తువులు కొనుగోలు చేసింది. దీంతో అనుమానం వచ్చిన ఓ దుకాణదారుడు తన వద్ద ఉన్న కరెన్సీ మిషిన్‌లో లెక్కించగా దొంనోటు అని తేలింది. వెంటనే సమాచారం అందుకున్న పుత్తూరు సీఐ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆ దుకాణం వద్దకు వెళ్లి సీసీ కెమెరా ద్వారా దొంగనోట్లను ఇచ్చిన వారిని గుర్తించారు. అనంతరం కూపీలాగగా ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వినోదాన్ని అందించే యూట్యూబ్‌తో ఇలాంటి నేరాలు కూడా చేస్తారా.? అంటూ ఇది తెలిసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..