AP Capital: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏపీ రాజధాని అంశం… కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

|

Mar 19, 2021 | 5:34 PM

తిరుపతి ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Capital: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏపీ రాజధాని అంశం... కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
Ex Mp Chinta Mohan Sensational Comments
Follow us on

ex mp chinta mohan on AP capital : తిరుపతి ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తిరుపతిలో శుక్రవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారన్నారు. అలాగే.. దేశం, రాష్ట్రం నాశనం అవుతోందని, మౌనంగా ఉండటం ఇష్టం లేక నోరు విప్పుతున్నానని చెప్పుకొచ్చారు.

కాగా, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు మాజీ సీఎం చంద్రబాబు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కీలకమైన పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని ప్రకటించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ మూడు రాజధానులు కాకుండా ఏపీకి మరో రాజధాని ఉంటుందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఏపీకి రాజధాని అవుతుందని జోస్యం చెప్పారు. . తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న చింతా మోహన్.. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు తన మిత్రుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర రెడ్డిని గద్దె దించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది వైఎస్సార్ అని గుర్తు చేశారు. మరి చెన్నారెడ్డితో మెదలైన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీకి చేరిందన్నారు. తర్వాత ఉద్యమానికి కేసీఆర్ సారథ్యం వహించారని, సీపీఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలు ఇచ్చాయని గుర్తు చేశారు.

ఇక, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు తాను ఉత్తరం కూడా రాసినట్లు చింతా మోహన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా తాను రాసిన లేఖను చింతా మోహన్ మీడియాకు చూపించారు. తిరుపతి చూట్టూ లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. తిరుపతి రాజధాని అవుతుందని పోతులూరి వీరబ్రహ్మంగారి కాల జ్ఞానంలో కూడా ఉందని వివరించారు.

అంతేకాదు, తుళ్లూరు ప్రాంతం రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానని చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తుళ్లూరు శపించబడ్డ స్థలమని, ఆ స్థలంలో చంద్రబాబు అడుగు పెట్టి మటాస్ అయ్యారని వ్యాఖ్యానించారు. టి.అంజయ్య, భవనం వెంకట్రాం, ఎన్టీఆర్ సైతం పదవులు పోగొట్టుకున్నారని చెప్పారు. తుళ్లూరులో అడుగుపెడితే పదవి గండం తప్పదన్నారు.

ఇక, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదని చింతా మోహన్ విమర్శించారు. టీడీపీ మునిగిపోయే నావ అని, చంద్రబాబు చల్లని రూపాయని ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నిక చరిత్రలో నిలబడిపోతుందని జోస్యం చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఒక టర్నింగ్ పాయింట్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివని తెలిపారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వంపై చింతా మోహన్ అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అజ్ఞానంతో పరిపాలన చేస్తున్నారన్నారు. బ్యాంకులు, రైల్వే, ఎల్ఐసీ, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చింతా మోహన్ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ, వైసీపీకి తేడా లేదని, ఎల్ఐసీ బిల్లు విషయంలో బలపరచడంతో ఆ విషయం తేటతెల్లమైందన్నారు.

Read Also…  మహిళలకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. త్వరలో వడ్డీలేని రుణాలు అందిస్తామన్న మంత్రి హరీశ్‌రావు