
భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తిరుమల భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు పోలీసు శాఖ.
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏరియా డామినేషన్ నిర్వహించింది. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంతో అప్రమత్తంగా ఉన్నామన్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో తిరుమల ఒకటని, డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ నిర్వహించామన్నారు తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్. ఈ గస్తీ నిరంతరం కొనసాగిస్తా మన్నారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులతో కలిపి నాలుగు బృందాలుగా ఏర్పడి 138 మంది సిబ్బందితో తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అలిపిరి వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండ కు అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంది.
ఇక తిరుపతి విమానాశ్రయంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపధ్యంలో దేశంలోని విమానాశ్రయాల భద్రత పై కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి విమానాశ్రయం అధికారులతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎయిర్పోర్ట్ భద్రత పై సమీక్ష చేశారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని ఆదేశించారు.
అనుమానిత వస్తువులు, ప్రయాణికుల లగేజీ ని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేసి అనుమతించాలని విమానాశ్రయ భద్రత సిబ్బందికి సూచించారు. సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనగా ఈ మేరకు భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..