Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. రోడ్లపైనే వాహనాలు.. భక్తులకు తప్పని తిప్పలు..

కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై సరికొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులతో పాటు, అంతేస్థాయిలో చేరుతున్న వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు గ్రీన్ బెల్ట్‌గా ఉండాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రంలో వాహన కాలుష్యం కోరలు చాస్తుంటే.. మరోవైపు పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. రోడ్లపైనే వాహనాలు.. భక్తులకు తప్పని తిప్పలు..
Tirumala Parking Problem

Edited By:

Updated on: Aug 18, 2026 | 11:52 AM

కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఇప్పుడు భక్తులతోనే కాకుండా వాహనాలతోనూ కిటకిటలాడుతోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు కావడంతో కొండపై పార్కింగ్ కొరత, పెరిగిపోతున్న కాలుష్యం, ఘాట్ రోడ్డు ప్రమాదాలు పెను సవాళ్లుగా మారుతున్నాయి. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 16 పార్కింగ్ కేంద్రాల్లో కేవలం 6 వేల నుంచి 7 వేల వాహనాలను మాత్రమే నిలిపేందుకు వీలుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణ రోజుల్లో 10 వేలకు పైగా, వారాంతాలు, సెలవు దినాల్లో దాదాపు 14 వేల వాహనాలు కొండపైకి చేరుతున్నాయి. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల వాహనాలు అక్కడే ఉండిపోతుండటంతో ప్రతిరోజూ దాదాపు 20 వేల వాహనాలు తిరుమలలోనే ఉంటున్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది. స్థలం లేకపోవడంతో లేపాక్షి, బాలాజీ బస్టాండ్, నందకం, వరాహస్వామి గెస్ట్ హౌస్, మ్యూజియం ప్రాంతాల్లో రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాలను నిలుపుతున్నారు. దీంతో పాదచారులకు, సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

కాలుష్య కోరల్లో గ్రీన్ బెల్ట్..

వాహనాల తాకిడితో ఎకో-సెన్సిటివ్ గ్రీన్ బెల్ట్‌గా ఉండాల్సిన తిరుమలలో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. ముళ్లగుంట, పీఏసీ 5 ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని టీటీడీ భావించినప్పటికీ, ఆ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోలేదు. దీంతో కాలుష్యాన్ని అరికట్టేందుకు దాతల సహకారంతో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అలిపిరి వద్ద నిరీక్షణ.. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు

మరోవైపు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీల కోసం భక్తులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అలిపిరి టోల్‌గేట్ వాహనాలతో కిక్కిరిసిపోతుంది. తనిఖీ సిబ్బంది తక్కువగా ఉండటంతో భక్తుల నిరీక్షణ సమయం పెరుగుతోంది. వాహనాల రద్దీకి తోడు ఘాట్ రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తిరుమల నుంచి తిరుపతికి దిగే మొదటి ఘాట్ రోడ్డులోనే నెలకు సగటున 10కి పైగా ప్రమాదాలు నమోదవుతున్నాయి. వాహనాల కాలుష్య నియంత్రణ, ప్రమాదాల నివారణకు టీటీడీ విజిలెన్స్, పోలీసు యంత్రాంగం నిఘా పెంచాయి. పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు టీటీడీ మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us