Srikakulam: పులి వచ్చిందని వణికిపోయిన గ్రామం – తీరా బంధించాక అదేంటో తెలిసి ఆశ్చర్యపోయిన వైనం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జయకృష్ణాపురం గ్రామం భయంతో వణికిపోయింది. గ్రామ సమీపంలో పులి తిరుగుతోందని పుకార్లు గుప్పుమన్నాయి. ఊహించని ఆందోళనతో గ్రామస్థులు తలోదిక్కుకు పరుగులు తీశారు. పులి ఉందని నమ్మిన ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత

Srikakulam: పులి వచ్చిందని వణికిపోయిన గ్రామం - తీరా బంధించాక అదేంటో తెలిసి ఆశ్చర్యపోయిన వైనం
Fishing Cat

Updated on: Jun 17, 2025 | 4:58 PM

అమ్మో పులి – అంటూ ఆ ప్రాంతమంతా వణికిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అటవీ శాఖ సమాచారమిచ్చారు. వారు వచ్చేలోగా ఆ పులి తమ జీవాలపై దాడి చేస్తుందేమో అని భావించి — గ్రామంలోని కొందరు ధైర్యవంతులు దాన్ని బంధించేందుకు పూనుకున్నారు. ఎట్టకేలకు చాకచక్యంగా దాన్ని బంధించారు. అయితే ఆ తరువాత అసలు విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జయకృష్ణాపురం గ్రామంలో పులి తిరుగుతోందని జోరుగా పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తతో గ్రామస్థులంతా భయంతో గడగడలాడిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్న గ్రామస్తులు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

గ్రామ సమీపంలో ఒంటిపై చారలు, పులి లాంటి పోలికలతో కనిపించిన ఓ జంతువు అందరినీ హడలెత్తించింది. దాన్ని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించిన అనంతరం అది పులి కాదని ఫిషింగ్ క్యాట్ అని తేల్చారు.

ఫిషింగ్ క్యాట్.. పులి లాంటి చారలతో ఉన్న పెద్ద పిల్లి జాతికి చెందిన జంతువు. ఇది సాధారణంగా మన ఇళ్లలో కనిపించే పిల్లి కంటే పెద్దదిగా.. కాస్త భయంకరంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని బావురు పిల్లి అని కూడా పిలుస్తారు. ఈ జాతి జంతువులు అధికంగా నీటిలో ఉండే పాములు, చేపలను ఆహారంగా తీసుకుంటాయి.

ఫిషింగ్ క్యాట్స్ సంఖ్య తగ్గిపోవడం వల్ల అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొన్ని నెలల క్రితం ఇదే నియోజకవర్గంలో పులి అడుగుజాడలు కనిపించడం వల్ల గ్రామస్థులు ఇప్పటికీ అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి ఫిషింగ్ క్యాట్‌ను చూసి పులి అని అందుకే భయపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,,