కంటే కూతుర్నే కనాలి..! కొడుకులు లేరని ఆ తండ్రికి చివరి వీడ్కోలు ఆగిపోలేదు.. ఓ కన్నీటి గాధ..

కృష్ణా జిల్లా పామర్రులో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల పలగాని వెంకటనారాయణ గుండెపోటుతో మృతి చెందగా.. ఆయనకు ముగ్గురు కుమార్తెలు చివరి వీడ్కోలు పలికారు. కుమారులు లేకపోయినా వెనుకడుగు వేయకుండా లత, ప్రసన్న తండ్రి పాడెను తమ భుజాలపై మోశారు. పెద్ద కుమార్తె జ్యోతి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చివరి ప్రయాణంలో కుమార్తెలే అండగా నిలిచిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

కంటే కూతుర్నే కనాలి..! కొడుకులు లేరని ఆ తండ్రికి చివరి వీడ్కోలు ఆగిపోలేదు.. ఓ కన్నీటి గాధ..
Daughters Carry Fathers Bier

Edited By:

Updated on: Aug 18, 2026 | 11:41 AM

పుట్టినప్పుడు తండ్రి చేతుల్లో ఒదిగారు. పెరిగాక ఆయన చేతిని పట్టుకుని నడిచారు. పెళ్లిళ్లు అయ్యాక వేర్వేరు ఇళ్లకు వెళ్లారు. కానీ తండ్రితో బంధం మాత్రం ఎక్కడికీ పోలేదు. ఆ బంధానికి చివరి సాక్ష్యంగా నిలిచింది పామర్రు అరండల్పేటలో జరిగిన ఓ విషాద ఘటన.. తండ్రి ఇక లేరని తెలిసి కన్నీళ్లతో వచ్చిన ముగ్గురు కుమార్తెలు… చివరకు ఆయన్నే తమ భుజాలపై మోసుకెళ్లారు.. ఇది పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా పామర్రు అరండల్పేటకు చెందిన పలగాని వెంకటనారాయణ వయసు 65 సంవత్సరాలు. గుండెపోటుతో సోమవారం ఆయన మృతిచెందారు. భార్య వెంకటరమణతో పాటు జ్యోతి, లత, ప్రసన్న అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. నాన్న చనిపోయాడన్న వార్త తెలియగానే… ముగ్గురూ పుట్టింటికి చేరుకున్నారు..

ఇంట్లో విషాదం..తండ్రి మృతదేహం ముందు కన్నీళ్లతో నిలబడిన కుమార్తెలు. అంత్యక్రియలకు సమయం దగ్గరపడుతున్నా. కుమారులు లేకపోవడంతో ఏం చేయాలన్న ఆలోచన బంధుమిత్రుల్లో మొదలైంది. కానీ కుమార్తెలు మాత్రం మరోలా ఆలోచించారు. నాన్నకు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. లత, ప్రసన్న తండ్రి పాడెను తమ భుజాలపై మోశారు. తండ్రిని చివరిసారిగా మోస్తూ అడుగులు వేస్తున్న కొద్దీ కన్నీళ్లు ఆగలేదు. చిన్నప్పుడు తమను ఎత్తుకుని నడిచిన నాన్నను. ఇక తిరిగి లేవని తెలిసిన ఆ తండ్రినే చివరిసారిగా తమ భుజాలపై మోసుకెళ్లారు..

ఆ దృశ్యం చూసిన బంధువులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. పెద్ద కుమార్తె జ్యోతి మాత్రం మరో బాధ్యత తీసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి అంతిమ సంస్కారాలను ఆమె నిర్వహించారు. తండ్రికి చివరి వీడ్కోలు పలుకుతున్న సమయంలో ముగ్గురు కుమార్తెల కన్నీళ్లు అక్కడున్న వారినీ కంటతడి పెట్టించాయి. కొడుకు లేకపోయినా లోటు కనిపించలేదు. తల్లిదండ్రులను కని పెంచిన పిల్లలు చివరి క్షణాల్లో అండగా ఉండటమే అసలైన బంధానికి నిదర్శనం. వెంకటనారాయణకు ముగ్గురు కుమార్తెలే.. అయితే ఆయన చివరి ప్రయాణంలో మాత్రం నాకు కొడుకులు లేరనే లోటు లేదు అన్నట్టుగా కుమార్తెలే నిలిచారు..

పాడె మోశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కన్నీళ్లతో తండ్రికి వీడ్కోలు పలికారు. పెళ్లయి వేర్వేరు ఇళ్లకు వెళ్లినా… నాన్న తమకు పరాయి కాదని ఆ ముగ్గురు కుమార్తెలు చేతల్లో చూపించారు. తండ్రి జీవితాంతం తమ కోసం చేసిన త్యాగాలకు ఆయన చివరి ప్రయాణంలో తమ వంతు ప్రేమను చెల్లించారు. నాన్నను కని పెంచిన కుమార్తెలు చివరకు నాన్నకు చివరి ప్రయాణంలో భుజం అయ్యారు. ఇదే ఆ తండ్రికి కుమార్తెలు ఇచ్చిన చివరి కానుక.. అంటూ పలువురు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us