
ఏపీలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సంక్రాంతి పండక్కి భారీగా సెలవులు ప్రకటించింది. జనవరి 2026 సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఉద్యోగ, వ్యాపార, విద్య వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుని స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా పండుగ జరుపుకుంటారు.
ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. 4వ తేదీ ఆదివారం, 10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం, 14వ తేదీ భోగి (బుధవారం), 15వ తేదీ మకర సంక్రాంతి (గురువారం), 16వ తేదీ కనుమ (శుక్రవారం), 18వ తేదీ ఆదివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం (సోమవారం) సెలవులు రానున్నాయి. ఇక ఆప్షనల్ హాలీడేస్‌లో జనవరి నూతన సంవత్సరం (గురువారం), 3వ తేదీ హజ్రత్ అలీ జయంతి (శనివారం), 16వ తేదీ షబ్-ఎ-మెరాజ్ (శుక్రవారం) ఉన్నాయి.
ఇక విద్యార్థులకు మొత్తం జనవరిలో 13 సెలవులు వచ్చాయి. సంక్రాంతికి ఏకంగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఆదివారం సెలవులు చూసుకుంటే మొత్తం 13 రోజులు స్కూళ్లు బంద్ కానున్నాయి. విద్యార్థులకు అదనంగా 12, 13, 17వ తేదీల్లో సంక్రాంతి సెలవులు ఇచ్చారు.