Andhra: అమ్మ బాబాయ్.. పాము మాదిరిగా అతని చర్మం రోజూ ఊడిపోతుంది..

ప్రభు ప్రసాద్‌ – సూపర్‌హీరో కాదు. కానీ అతనికి ఉన్న పట్టుదల, మనోధైర్యం లాంటి క్వాలిటీస్ సూపర్‌హీరోలా కనిపించేట్టు చేస్తున్నాయి. కేవలం 21 ఏళ్ల ప్రాయం కలిగిన ఈ ప్రభు, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందినవాడు. వింత చర్మ వ్యాధి కారణంగా అతను రోజూ తీవ్రమైన బాధను అనుభవిస్తున్నాడు.

Andhra: అమ్మ బాబాయ్.. పాము మాదిరిగా అతని చర్మం రోజూ ఊడిపోతుంది..
Prabhu Prasad

Updated on: Jun 04, 2025 | 4:35 PM

పాపం ఈ యువకుడు.. నిజంగా అతని పరిస్థితి గురించి చెబితే మీకూ జాలి కలుగుతుంది. అతనికి ఓ అరుదైన చర్మ వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా అతని చర్మం ప్రతి రోజూ రాలిపోతుంది. దీంతో అతని చర్మం పాము చర్మంగా కనిపిస్తుంది. దీంతో అతని తీవ్రమైన నొప్పికి గురవుతున్నాడు. సూర్య కిరణాలు తాకితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఎండలోకి వెళ్తే అతను గంటకు ఒకసారి స్నానం చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి 21 ఏళ్ల ఈ యువకుడి పేరే ప్రభు ప్రసాద్.

అతని రూపాన్ని చూసి స్థానికులు అతడిని ‘సాన్ప్ ప్రసాద్’ అని పిలుస్తారు. అంటే పాము ప్రసాద్ అనమాట. అతడ్ని వెక్కిరించాలనే ఉద్దేశం గ్రామస్తులకు లేనప్పటికీ.. ఆ పేరు అలా వాడుక అయిపోయింది. కాగా ప్రసాద్ కనిపిస్తే చాలామంది దూరం జరుగుతారు. స్నేహం చేసేవాళ్లు చాలా అరుదు అనే చెప్పాలి. అయినప్పటికీ ప్రభు ప్రసాద్ తన లక్ష్యాలను వదల్లేదు. మంచిగా చదువుకుని.. ఉద్యోగం సంపాదించి.. తన తల్లికి మెరుగైన జీవనం అందించాలని అతను ఆరాటపడుతున్నాయి.

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు ప్రభు ప్రసాద్. తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అనేక ఆసుపత్రులకు వెళ్లినా, అతని వ్యాధికి సరైన చికిత్స దొరకలేదు. వైద్యులు దీనికి చికిత్స లేదని చెప్పడంతో జీవితాన్ని అలానే నెట్టుకొస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్ళే స్థోమత లేక, అతను ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడ్డాడు.

సమాజం దూరం పెడుతున్నా.. ప్రభు ప్రసాద్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. చదువుకోవాలని, జీవితంలో ముందుకెళ్లాలని కలలు కంటున్నాడు. పాములా కనిపించే చర్మం తనకు ఏ మాత్రం అడ్డుకాదని.. పట్టుదలతో ముందుకు సాగుతానని బలంగా చెబుతున్నాడు ప్రభు ప్రసాద్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..