
బాపట్ల, జూన్ 15: రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో నుంచి వెళ్లే రైల్లలో ప్రయాణించే జనాలకు దినదినగండంగా మారుతుంది. తాజాగా సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు మరో మారు చోరీకి ప్రయత్నించడం కలకలం రేపింది. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న ఈ రైలులో నిద్రిస్తున్న ప్రయాణికులు నుంచి ఆభరణాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో కొందరు చైన్ లాగి రైలు ఆపారు. రైలు ఆగగానే దొంగలు చీకట్లో పరారయ్యారు. చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దొంగలఫై రైల్వే పోలీసులు కాల్పులు 9 రౌండ్ల జరిపారు. బాపట్ల అప్పికట్ల స్టేషన్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలులోని ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడల నుంచి సుమారు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.
చోరీ జరిగిన విషయం గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు వెంటనే నిలిచిపోయింది. అప్పటికే దుండగులు రైలు నుంచి దిగి సమీప పొలాల గుండా బాపట్ల-గుంటూరు రహదారి వైపు పారిపోయారు. దుండగులను వెంబడించిన ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే రక్షణ సిబ్బంది వారిని పట్టుకునేందుకు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం అప్పికట్ల-బత్తిపూడి గ్రామాల పరిసర పొలాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేసి ప్రత్యేక బృందాలతో అన్వేషణ ప్రారంభించారు. ఈ చోరీలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో గత రెండు నెలల వ్యవధిలో రైళ్లలో చోరీలు జరగడం ఇది మూడోసారి కావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏప్రిల్ 19న అప్పికట్ల సమీపంలో బెంగళూరు-నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో నిద్రిస్తున్న మహిళల మెడల నుంచి సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. అలాగే మూడు వారాల క్రితం బాపట్ల సరిహద్దులోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో సిగ్నల్ వ్యవస్థను దుండగులు టాంపరింగ్ చేసి చోరీకి యత్నించారు. ఆ సమయంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినా నిందితులు తప్పించుకున్నారు. కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే రెండు నెలల్లో వరుసగా మూడు చోరీలు జరగడం రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు.