నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో భర్త రామ్మోహన్ భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్‌కు పార్వతిని ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన రెండు సంవత్సరాల నుంచి కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తరచుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పుట్టినిల్లు అయిన కనకాద్రిపల్లెలో పార్వతి నివాసం ఉంటుంది. భర్త రామ్మోహన్ తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతుండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. జులాయిగా తిరుగుతున్న రామ్మోహన్ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి రామ్మోహన్ భార్య పార్వతిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసి కత్తితో విచక్షణ రహితంగా శరీర భాగాలు కోసి పరారైయ్యాడు.
ఉదయం లేచిన తన కుమారుడు పవన్ కుమార్ రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పరిగెత్తి పక్కనే ఉన్న అవ్వగారికి విషయం చెప్పాడు. పార్వతి కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న పార్వతి అప్పటికే మృతి చెందిది. మృతి చెందిన పార్వతిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొలిమిగుండ్ల పోలీసులు తెలిపారు.