ఆధునిక కాలంలో వింత వింత రోగాలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరోవైపు కొంతమంది ఆకతాయిలు నకిలీ డాక్టర్ల అవతారమెత్తి నట్టేట ముంచుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పదో తరగతి చదివిన ఓ వ్యక్తి జనాలకు వైద్యం చేస్తున్నాడు.. కొంతమంది స్థానికుల ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించిన ఉన్నత అధికారులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి.
నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో సతీశ్ అనే వ్యక్తి గాబ్రేల్ పేరుతో ఓ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివిన పెద్ద పెద్ద డాక్టర్లే కొన్ని వ్యాధులను నయం చేయలేక చతికిలపడుతుంటే ఈయన మాత్రం కరోనాతో పాటు అన్ని రోగాలకు చికిత్స అందిస్తానని ప్రకటించుకున్నాడు. విషయం తెలసిన జిల్లా వైద్యాధికారి ఆస్పత్రిపై తనిఖీలు నిర్వహించి సర్టిఫికెట్లు, అనుమతులు చూపాలని ఆదేశించాడు. వెంటనే సతీశ్ తాను పదో తరగతి వరకు మాత్రమే చదివానని, పీఎంపీ, ఆర్ఎంపీ సర్టిఫికెట్ కూడా ఏమీ లేదని ఓప్పుకున్నాడు. వెంటనే అధికారులు ఆస్పత్రని సీజ్ చేసి, అక్కడ అన్న మందులను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నగరంలో సతీశ్ మాదిరి వైద్యం బిజినెస్ చేసేవారు చాలామంది ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వారందరికీ విషయం తెలియడంతో చాలా మంది క్లినిక్‌లు మూసేసి పరారవుతున్నారు.