
విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఆగంతకుడిని పట్టుకునేందుకు ఏకంగా ఎమ్మార్వోనే రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా ఓ యువకుడు మున్సిపల్ పాఠశాల వద్ద మకాం వేసి, విద్యార్థినులు వెళ్లే సమయంలో అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ.. వారికి అసభ్యకరమైన చిత్రాలను చూపుతున్నాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు బడికి రావడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. ఆ యువకుడు ఎవరో తెలుసుకునేందుకు ఆరా తీసినా వివరాలు తెలియరాలేదు. చివరికి విద్యార్థినులు కన్నీటిపర్యంతమవుతూ పక్కనే ఉన్న తహశీల్దార్ గోపాలకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
విద్యార్థినుల ఫిర్యాదుతో తహశీల్దార్ గోపాలకృష్ణ ఆగంతకుడి కోసం ప్రాథమికంగా ఆరా తీసినప్పటికీ ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో ఆయనే మరుసటి రోజు మారువేశంలో వచ్చి సీఐ రాంబాబు, కానిస్టేబుళ్ల సహకారంతో పాఠశాల వద్ద నిఘా పెట్టారు. తహశీల్దార్ ముఖానికి మాస్క్ ధరించి ఒకసారి సైకిల్‌పై, మరోసారి బైక్‌పై తిరుగుతూ, తనతో వచ్చిన పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ అనుమానం రాకుండా కాపు కాశారు.
అనుకున్నట్లుగానే ఆ ఆగంతకుడు బైక్‌పై పాఠశాల వద్దకు చేరుకున్నాడు. అతడిని గుర్తించిన ఒక విద్యార్థిని వెంటనే ధైర్యం చేసి మాస్క్ ధరించి ఉన్న తహశీల్దార్ వద్దకు వెళ్లి సమాచారం అందించింది. అప్రమత్తమైన తహశీల్దార్, సీఐ, సిబ్బంది బైక్‌పై పారిపోయేందుకు సిద్ధమైన యువకుడిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే వారి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు బైక్ ఆపకుండా వేగంగా పరారయ్యాడు. పోలీసులు ఎంత వెంబడించినా అతడు దొరకలేదు.నిందితుడు బైక్‌పై వచ్చిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో పాఠశాలకు వెళ్లిన తహశీల్దార్, సీఐ విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు భరోసా కల్పించారు. ఆగంతకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తమకు ఫోన్ చేయాలంటూ నంబర్లు అందించారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.