
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, కోల్డ్ వేవ్ పై కీలక అప్డేట్ ఇచ్చింది.. మరో రెండురోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31, జనవరి 1 2026 న వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. అయితే.. రాయలసీమలో పొడి వాతావరణంతోపాటు.. జనవరి 1 గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానము, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆ తర్వాత 3 రోజుల్లోపెద్దగా మార్పు ఉండదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న దక్షిణ ఆంధ్ర కోస్తా తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి.. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 5°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం కొన్ని ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..