తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. IMD తాజా హెచ్చరికల ప్రకారం అక్టోబర్ 2 నుంచి 5 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణకు కూడా ఉరుములు, మెరుపుల హెచ్చరిక ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాతున్నాయి. ఇటీవల వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఉక్కపోతతోపాటు.. పొడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అలాగే.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు
కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
తెలంగాణలో వెదర్..
తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం వేళ కొంత ఎండ తీవ్రత కనిపించినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడే అవకాశముంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల వరకు.. 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
