ఆంద్రప్రదేశ్‌లో కొంత కాలంగా ఆలయ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం ఘటనలను పొలిటికల్ మైలేజ్‌గా మల్చుకునేందుకు టీడీపీ, బీజేపీ పోటాపోటీగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి దేవాలయాల పరిరక్షణ పేరుతో రథయాత్ర ప్రారంభిస్తామని కమలనాథులు ఇప్పటికే ప్రకటించారు. యాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఇక బీజేపీకి పోటీగా ఇప్పుడు టీడీపీ కూడా రంగంలోకి దిగింది. ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.
త్వరలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎప్పుడైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. బీజేపీ దేవాలయాల యాత్ర ఎన్నికల నేపథ్యంలోనే చేస్తున్నదని భావించిన టీడీపీ.. ధర్మ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టింది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ తిరుపతిలో యాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం పదిన్నరకు అలిపిరి సెంటర్ నుంచీ ర్యాలీగా బయల్దేరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏడు వందల గ్రామాల గుండా పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ధర్మ పరిరక్షణ యాత్రను సక్సెస్ చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారు. అయితే ఇది పేరుకు ధర్మపరిరక్షణ యాత్రే అని చెప్పినా ఎన్నికల ప్రచారంగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు. అయితే తిరుపతిలో ఎలాంటి ర్యాలీలకు, యాత్రలకు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో తిరుపతిలో టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.