టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులందరూ కోటీశ్వరులే! అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు

రాజ్యసభ ఎన్నికల టీడీపీ అభ్యర్థుల అఫిడవిట్లు వారి వ్యక్తిగత, ఆర్థిక స్థితిని బయటపెట్టాయి. భాష్యం రామకృష్ణ రూ.672 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలవగా, సానా సతీష్‌బాబుకు కోట్ల చరాస్తులున్నా సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం. చింతకాయల విజయ్ కుటుంబ ఆస్తులు, కేసుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులందరూ కోటీశ్వరులే! అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు
Tdp Rajya Sabha Candidates

Edited By:

Updated on: Jun 09, 2026 | 10:13 AM

రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల అఫిడవిట్లు వారి వ్యక్తిగత, ఆర్థిక ముఖచిత్రాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించాయి. సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన ముగ్గురు అభ్యర్థులు.. భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్ తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు, లగ్జరీ కార్లు, భారీగా బంగారు ఆభరణాలు కలిగిన ఈ నేతల ప్రస్థానంలో ఒకరి పేరిట వందల కోట్ల స్థిరాస్తులు ఉంటే, మరొకరికి సొంత ఇల్లే లేకపోవడం గమనార్హం.

భాష్యం రామకృష్ణ: రూ. 672 కోట్ల సామ్రాజ్యం

టీడీపీ అభ్యర్థుల్లో విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఈయన కుటుంబ మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా రూ.672.61 కోట్లు. ఇందులో అత్యధికంగా రూ.502.64 కోట్ల విలువైన స్థిరాస్తులు, వ్యవసాయ, వాణిజ్య, నివాస భవనాలు ఉండగా, కేవలం రామకృష్ణ ఒక్కరి పేరిటే రూ.454.95 కోట్ల ఆస్తులు కేంద్రీకృతమై ఉన్నాయి.

వీరి కుటుంబ చరాస్తుల విలువ రూ.169.97 కోట్లు కాగా, అందులో వాహనాల విలువే రూ.18.37 కోట్లు కావడం విశేషం. ఇందులోనూ మెజారిటీ వాటాగా ఆయన కుమారుడు సాకేత్ రామ్ పేరిట రూ.18.14 కోట్ల విలువైన లగ్జరీ వాహనాలు ఉన్నాయి. రామకృష్ణ వద్ద రూ.2.20 కోట్ల విలువైన బంగారం, వెండితో పాటు 25 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణలో భాగంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈ కుటుంబం రూ.200.65 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఈయనపై హైదరాబాద్‌లో ఒక పాత వాహన ప్రమాదం కేసు మినహా ఇతర కేసులు లేవు.

సానా సతీష్ బాబు: రూ.27 కోట్ల చరాస్తి.. కానీ సొంతిల్లు లేదు

వ్యాపారవేత్తగా సుపరిచితులైన సానా సతీష్ బాబు దంపతుల ఆర్థిక ప్రయాణంలో ఓ విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. వీరికి రూ.27.80 కోట్ల మేర భారీగా చరాస్తులు ఉన్నాయి. కియా ఈవీ 6, ఫార్చూనర్, మెర్సిడెజ్ బెంజ్, ఇన్నోవా హైక్రాస్ వంటి విలాసవంతమైన వాహనాలు ఈ కుటుంబ గ్యారేజీలో ఉన్నాయి. దంపతులిద్దరి వద్ద కలిపి దాదాపు రూ.4.62 కోట్ల విలువైన 3,235 గ్రాముల బంగారం ఉంది. గత నాలుగేళ్లలోనే వీరి వార్షిక ఆదాయం రూ.6,170 (2020-21) నుంచి ఏకంగా రూ. 2.16 కోట్లకు (2024-25) పెరిగింది. ఇంతటి ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పటికీ, వీరికి సొంతంగా ఒక్క నివాస గృహం కూడా లేకపోవడం విశేషం.

కాకినాడలో భార్య నాగజ్యోతి పేరిట ఉన్న రూ.4.11 కోట్ల విలువైన ఒక ఎకరం భూమి మినహా మరే ఇతర స్థిరాస్తులూ వీరికి లేవు. కుటుంబానికి మొత్తం రూ.2.21 కోట్ల అప్పులు ఉండగా.. గతంలో ఢిల్లీ లో నమోదైన సీబీఐ, ఈడీ కేసులను అఫిడవిట్‌లో ప్రస్తావించారు. అయితే సీబీఐ కేసులో తనపై ఎలాంటి ఛార్జ్‌షీట్ దాఖలు కాలేదని, ఈడీ కేసుపై న్యాయపోరాటం చేస్తున్నట్లు సతీష్ స్పష్టం చేశారు.

చింతకాయల విజయ్ ఆస్తి 38 కోట్లు

ఉత్తరాంధ్ర సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడైన చింతకాయల విజయ్ కుటుంబానికి రూ.38 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.7.06 కోట్ల చరాస్తులు ఉండగా, దాదాపు రూ.31.58 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఈ స్థిరాస్తుల్లో విజయ్ పేరిట రూ.7.44 కోట్ల కంటే ఆయన భార్య డాక్టర్ సువర్ణ కుమారి పేరిటే అత్యధికంగా రూ.24.14 కోట్ల ఆస్తులు ఉండటం గమనార్హం. వీరి వద్ద సుమారు 1,940 గ్రాముల బంగారం, 38.5 కిలోల వెండి ఉన్నాయి. కుమార్తె పేరిట సుకన్య సమృద్ధి యోజనలో రూ. 5.14 లక్షలు పొదుపు చేశారు. ఈ కుటుంబానికి రూ. 16.91 కోట్ల అప్పులు ఉండగా, అందులో భార్య పేరిటే రూ. 13.94 కోట్లు ఉన్నాయి. ఇక రాజకీయాల విషయానికొస్తే.. గత ప్రభుత్వ హయాంలో విజయ్‌పై నమోదైన ఆరు క్రిమినల్ కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us