అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. అనారోగ్యంతో ఉన్న చిన్నారిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతోనే ఏడు నెలల చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు. కల్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ స్వాగత సంబరాలు జరగుతుండగా ఈ ఘటన జరిగిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేశ్ దంపతుల కూతురు పండు.. అనారోగ్యానికి గురైంది. పండును ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారంటూ చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అడ్డుకోకుండా ఉంటే తమ పాప బతికేదని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. సకాలంలో అంబులెన్సు కూడా రాలేదని పాప మేనమామ ప్రశాంత్ ఆరోపించారు. పాప మృతదేహంతో రోడ్డుమీద బైఠాయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ దంపతులకు మూడేళ్ల మరో కుమార్తె ఉంది. పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. అయితే తాము ఏ వాహనాలనూ ఆపలేదని, స్థానిక డీఎస్పీ చెప్పడం విశేషం.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి, పసిపాప చనిపోడానికి కారణమయ్యారని మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమన్నారు. అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Also Read
COVID Cases: ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేజ్రీవాల్ సర్కార్..!
KS Eshwarappa: మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. ఇతర పార్టీలకు కలిసివస్తుందా..? అసలు బీజేపీ ప్లాన్ ఏంటీ