Chandrababu Naidu: ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అమరావతిలోని టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబును కలిసిన సత్యనారాయణ, నూకరత్నం తమ కుమారుణ్ని తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుణ్ని దారుణంగా చంపేశాడని వాపోయారు. కొడుకును పోగొట్టుకుని తీవ్ర శోకంలో ఉన్న కుటుంబాన్ని టీడీపీ ఆర్ధికంగా ఆదుకుంది. 5లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేయటంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తమ బిడ్డ చనిపోయి నెల రోజులు దాటినా.. ఇంతవరకు తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం నిందితుడు అనంతబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. న్యాయస్థానం ఆయన వినతిని తిరస్కరించింది. మరోవైపు ఇటీవలే జగన్ సర్కారు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు వైద్యారోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీతో ఆయన అనుచరులు కూడా ఈ హత్యలో భాగమయ్యారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.