గోదావరి జిల్లా రాజకీయాలు కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో.. కాపులను తమ వైపు తిప్పుకోవడం కోసం ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నించింది. ముద్రగడ కూడా కుమారుడితో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. తాజాగా ముద్రగడ ముద్రగడను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన రంగంలోకి దిగడం గోదావరి జిల్లాల్లో సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపింది. ముద్రగడ జనసేనలో చేరితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కూటమికి తిరుగుండదనే నమ్మకంతో ఉన్నారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో పలువురు జనసేన నేతలు ఆయనతో కలిసి చర్చలు జరిపారు. అయితే, పవన్ కల్యాణ్ ఇచ్చిన లేఖను ముద్రగడకు అందించామని జనసేన నేతలు తెలిపారు.
జనసేనతో పాటు టీడీపీ నేతలు కూడా కిర్లంపూడిలో ముద్రగడను కలిశారు.. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిశారు. ఆయన మళ్లీ రాజకీయాల్లో వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. రాజకీయంగా తన కోసం మాత్రమే వచ్చానని, టీడీపీ అధిష్టానం తనకు చెప్పలేదని నెహ్రూ చెప్పారు. ఇది తన వ్యక్తిగతం మాత్రమే అని పార్టీకి సంబంధించిన విషయం కాదంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని ముద్రగడ చెప్పలేదని తెలిపారు.
తనను కలిసేందుకు వచ్చిన వాళ్లందరినీ అప్యాయంగా పలకరిస్తున్న ముద్రగడ పద్మనాభం.. తన మనసులో ఏముందనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. దీంతో ఆయన రాజకీయంగా ఎవరివైపు నిలుస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సంక్రాంతి తరువాత దీనిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..