
రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళుతున్నప్పుడు డబ్బులు దొరికితే దాన్ని అదృష్టంగా భావిస్తారు. చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌కి, షోరూమ్స్‌కి వెళ్లి ఇష్టమైన దుస్తులు, అవసరమైన వస్తువులు అందరూ కొనుగోలు చేస్తారు. కానీ నిరుపేదలు, మురికివాడల్లో నివసించే సామాన్యుల పరిస్థితేంటి. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్‌లకు వెళ్లగలరా.? తమ తమ జీవితాల్లో ఒక్కసారైనా కోరుకున్న బట్టకట్టి.. ఇష్టమైన తిండి తిని ఒక రోజును విధిరాతకు భిన్నంగా గడపగలరా.! ఇలాంటి ఊహ.. కలలో చాలామందికి అందంగా కనిపిస్తుంది, ఊరిస్తుంది.
క్రిస్మస్ పండుగ సమయంలో శాంతాక్లాజ్ వచ్చి బోలెడు బహుమతులు ఇచ్చినట్లు, ఏ తపస్సు చేయకుండానే భగవంతుడు ప్రత్యక్షమై కోరని వరాలు కురిపించినట్లు ఆ ఊర్లో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మురికివాడల్లో నివసించే చిన్నారులు షాపింగ్ మాల్‌లో తమకు ఇష్టమైన దుస్తులు ఎంచుకుని తనవెంట తీసుకువెళ్లారు. దీనికోసం వారికి ఏ లాటరీలో బంపర్ ప్రైజ్ రాలేదు. కానీ షాపింగ్ మాల్ నిర్వాహకులు మానవత్వం చూసుకోవడంతో ఇది సాధ్యమైంది.
పండుగలు ఏదైనా మధ్యతరగతి, ఉన్నతి వర్గాలు తమతమ స్థాయిల్లో పండుగలు, వేడుకలు జరుపుకుంటాయి. అయితే కడు పేదరికంలో ఉన్నవారికి అది కొత్త సంవత్సరమైనా, పెద్ద పెద్ద పండగలైనా ఒకేవిధంగా రోజులు గడుస్తాయి. ఇలాంటి వారికి తణుకులోని వన్ ఇండియా షాపింగ్ మాల్ మంచి అవకాశం కల్పించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు మాల్‌కి వచ్చి తమకు నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకుని తమ వెంట తీసుకువెళ్లవచ్చు. విషయం తెలుసుకున్న పిల్లలు.. తమ తల్లిదండ్రులతో అక్కడికి చేరుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని నిర్వాహకులను అభినందించారు.