Andhra News: ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.97 కోట్లు స్వాహ.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..
స్టాక్ మార్కెట్, ఐపీవోల పేరిట భారీ లాభాల ఆశ చూపి కోట్ల రూపాయల ఘరానా మోసాలకు పాల్పడుతున్న మరో ముఠా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అద్దంకి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సైబర్ నేరాలకు గురికాకుండా పోలీసులు ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయకులను, చదువుకున్న యువతను సైతం బురిడీ కొట్టిస్తూ కోట్లలో దండుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీవోల పేరిట అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.1,97,60,870 కొల్లగొట్టారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన పర్చూరి సురేష్ బాబు అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు. గుర్తుతెలియని వ్యక్తులు సాన్వి వాధ్వా, భూమిక ధోలా, జిమీత్ మోదీ అనే పేర్లతో సురేష్ బాబును వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. అనంతరం SAMCO Securities Limited పేరుతో ఉన్న ఒక నకిలీ iOS అప్లికేషన్ లింక్‌ను పంపించారు. స్టాక్ మార్కెట్లో, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని అతనికి ఆశ చూపించారు.
వారి మాటలు నమ్మిన బాధితుడు 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 24 వరకు విడతల వారీగా మొత్తం రూ.1,97,60,870 ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేశాడు. స్క్రీన్‌పై భారీగా లాభాలు కనిపిస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత మొత్తం చెల్లించాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో స్పందించడం మానేశారు. తాను దారుణంగా మోసపోయానని గుర్తించిన బాధితుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అనంతరం అద్దంకి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం IT యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరికలు
ఈ తరహా సైబర్ నేరాలపై ప్రజలకు, ముఖ్యంగా చదువుకున్న యువతకు అద్దంకి సీఐ సుబ్బరాజు పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు
- సైబర్ కేటుగాళ్లు ముందుగా వాట్సాప్ గ్రూపులు తయారు చేసి, తామే పెట్టుబడులు పెట్టినట్లు, రోజూ వేల రూపాయలు లాభాలు వస్తున్నట్లు నకిలీ సమాచారంతో నమ్మిస్తారు.
- ఆన్లైన్ యాప్‌లలో లాభాలు కేవలం స్క్రీన్ మీదే కనపడతాయి. నిజానికి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ కాదు.
- ప్రారంభంలో నమ్మకం కుదరడానికి స్వల్ప మొత్తం తిరిగి ఇచ్చినా, భారీగా పెట్టుబడులు పెట్టాక ఖాతాలను బ్లాక్ చేస్తారు.
- సులభంగా, కష్టపడకుండా రాత్రికి రాత్రే కోట్లు సంపాదించవచ్చని వచ్చే ఆన్లైన్ మెసేజ్‌లు, బెట్టింగ్, ట్రేడింగ్ లింకులను నమ్మి అత్యాశకు పోవద్దు.
- సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి ఒకసారి డబ్బు వెళ్లాక దాన్ని వెనక్కి రికవరీ చేయడం ఎంతో క్లిష్టతరం.
- బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేస్తున్న యువత కూడా ఇలాంటి ఉచ్చులో పడటం బాధాకరం. చదువుకున్న వారు తమ చుట్టుపక్కల వారికి కూడా ఈ సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించాలి.
- గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు. అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాలు జరిగితే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
