ఏపీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళంజిల్లా పలాసలోని గౌతులచ్చన్న విగ్రహం దగ్గర ఈ ఉదయం పది గంటలకు టీడీపీ ఆందోళనకు సిద్ధమైంది. అయితే టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు ఉదయం నుండి 10 గంటల వరకూ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గరకు ఎవ్వరూ రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దాంతో శ్రీకాకుళంజిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసుల వైఖరికి నిరసనగా నేడు పలాస బస్టాండ్ దగ్గర…గౌతులచ్చన్న తనయుడు గౌతు శ్యామ్‌సుందర్, కుమార్తె గౌతు శిరీష నిరసనకు దిగుతున్నారు.
దాంతో శ్రీకాకుళంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. పోలీసులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గౌతులచ్చన్న అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు మంత్రి అప్పలరాజు. కావాలనే జూమ్ బాబు డైరెక్షన్ ఇస్తూ వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతోనే గౌతు లచ్చన్నకు అసలైన మకిలి పట్టిందని వ్యాఖ్యానించారు. కూల్చడం మొదలు పెడితే గౌతు లచ్చన్న విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి..మొదలు పెడతానని అన్నట్లు టీవీ9తో చెప్పారు మంత్రి అప్పలరాజు. టీడీపీ నేతల మాటలు నమ్మొద్దని..ఇదంతా చంద్రబాబు స్కెచ్ అని ప్రజలకు వివరించేప్రయత్నం చేశారు అప్పలరాజు.