Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారని, తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయబోతున్నారనే పొలిటికల్ టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు వారి అనుచరులు కూడా తమ నేతకు మంత్రి పదవి దక్కాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పూజలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కి మంత్రి పదవి రావాలని కోరుతూ గ్రామ దేవత మంచాలమ్మదేవికి, శ్రీ రాఘవేంద్రస్వామికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 216 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
మూడు నెలల క్రితం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ.. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ భాగ్యమ్మ తమ అనుచరులతో కలిసి ఉరుకుందు ఈరన్న దేవస్థానం నుండి కోసిగి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇక మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే తనయుడు ధరణి రెడ్డి అనుచరులు “ధరణి సైన్యం” పేరుతో ఉరుకుందు దేవస్థానం నుండి శ్రీశైలం వరకు బైక్ యాత్ర నిర్వహించారు. ఇవాళ మంత్రాలయం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ గ్రామ దేవత మంచాలమ్మకు, శ్రీ రాఘవేంద్రస్వామికి శ్రీ మఠం ప్రాంగణం లో 216 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతేకాదు.. మంత్రాలయం ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కాలంటూ గ్రామ గ్రామాల్లో పూజలు, ధానాలు చేస్తున్నారు.
Also read: