Andhra: ముందే వచ్చి మందగించిన నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అప్‌డేట్ ఇదే

నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి వర్షాలు కురిపించినా, ప్రస్తుతం మందగించాయి. వారం రోజుల ముందు కేరళను తాకి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ రుతుపవనాలు, గత మూడు, నాలుగు రోజులుగా వెనకడుగు వేసాయి. ఫలితంగా, వర్షాల స్థానంలో ఎండలు మండుతున్నాయి ..

Andhra: ముందే వచ్చి మందగించిన నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అప్‌డేట్ ఇదే
Weather

Updated on: Jun 04, 2025 | 4:53 PM

ముందుగా వచ్చి మురిపించిన నైరుతి రుతుపవనాలు.. మూడు, నాలుగు రోజులుగా మందగించాయి. వారం రోజులు ముందుగానే కేరళను తాకిన రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినట్లే విస్తరించి.. ఆపై వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా.. ఏపీ, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైందని ఆనంద పడే లోపే.. రుతుపవనాల మందగింపు ఆ ఆశలపై నీళ్లు జల్లిస్తోంది.

సాధారణంగా.. ఏపీలోకి జూన్ 4న ప్రవేశించాల్సిన నైరుతి రుపవనాలు.. మే 26నే పలకరించాయి. ఆ తర్వాత.. శరవేగంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. ఫలితంగా రెండు మూడు రోజులపాటు కొన్నిచోట్ల భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. దాంతో.. రెయినీ సీజన్‌ వచ్చేసిందన్న ఫీల్‌ వచ్చేసింది. కానీ.. గత మూడు నాలుగు రోజులుగా వరుణుడు జాడే లేకుండా పోయింది. తొలకరి జల్లులు మాయమైపోయాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతున్నప్పటికీ.. వ్యవసాయానికి ఊతమిచ్చేంతగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నైరుతి రుతుపవనాల మందగమనంపై వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రుతుపవనాల గమనంలో మార్పు వచ్చిందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి స్వరూప. రుతుపవనాలు ముందుగా రావడం వల్ల కాస్త బ్రేక్‌ రావొచ్చని..  అవి ఎప్పుడూ కంటిన్యూగా మూవ్‌ అవ్వవు అని చెప్పారు.  ప్రస్తుత పరిస్థితులు మరో వారం రోజుల వరకు కంటిన్యూ అవకాశం ఉంటుందంటున్నారు. ఆ తర్వాత రుతుపవనాల్లో కదలిక వచ్చి వర్షం పడుతుందంటున్నారు.

సో.. అదన్నమాట.. మరో వారం రోజులు వాన కోసం వెయిటింగ్‌ తప్పనట్లే కనిపిస్తోంది. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే గానీ.. రుతుపవనాలు పుంజుకునే అవకాశం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 11వ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్‌ ఉందని.. ఆ తర్వాత.. వర్షాలు ఊపందుకుంటాయని చెప్తున్నారు. అంతేకాదు.. ఈ సారి సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..