Software Employee Died: ఆమె గుంటూరులో అదృశ్యమైంది.. ఆ తర్వాత విజయవాడలో విగతజీవిగా కనిపించింది. ఏమైందో ఏమో కానీ.. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇరు జిల్లాల్లో కలకలం రేపింది. ఆదివారం గుంటూరులో ఇంటి నుంచి అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తనూజ మృతదేహం మంగళవారం విజయవాడలో లభ్యమైంది. ఆమె మృతదేహం విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన తనూజకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తున్న మణికంఠతో వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. కరోనా నేపథ్యంలో గుంటూరు వచ్చిన ఈ దంపతులు ఇంటినుంచే పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనూజ ఆదివారం అదృశ్యమైంది. అనంతరం కుటుంబసభ్యులు వెతికారు. బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా.. ఆచూకీ తెలియకపోవడంతో.. సోమవారం నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే తనూజ మృతదేహం విజయవాడ మాచర్ల రోడ్డులో కనిపించింది. మొదట తనూజ రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న గుంటూరు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: