Vizag Fishing Harbour Fire Accident Updates: విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంపై.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి లంగర్ వేసిన బోటులో పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా… క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి మొదట యూ ట్యూబర్, లోకల్ బాయ్ నానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రమాద ప్రాంతంలోని బోటులో స్నేహితులతో కలిసి యూట్యూబర్ నాని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే, లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న అతనికి బోటు ఉంది. ఆరోజే అతడి భార్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ కూడా పార్టీ అడగడంతో ఆదివారం రాత్రి బోటులో మందు పార్టీ ఇచ్చాడు నాని. ఈ పార్టీలో జరిగిన గొడవతో కావాలనే కొంతమంది బోటుకు నిప్పు అంటించారని..అది ఇతర బోట్లకు అంటుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోటు అమ్మకానికి పెట్టిన క్రమంలో అడ్వాన్స్ విషయంలో జరిగిన వివాదం కూడా ఘటనకు కారణం అన్న వాదన వినిపిస్తోంది.
యూట్యూబ్‌లో లోకల్ బాయ్ నానిగా గుర్తింపు పొందాడు. సముద్రంలో వేటకు వెళ్లి.. వలకు పడిన చేపల దృశ్యాలను.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. ఇలా అతనికి యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ నాని ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని నాని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని నాని చెబుతున్నాడు. ఆ సమయంలో అక్కడ లేకపోతే అగ్ని ప్రమాద సంఘటనను నాని వీడియో తీసి యూ ట్యూబ్‌లో ఎలా పెట్టాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై యూ ట్యూబర్ నానీని పోలీసులు విచారించారు. అయితే, మొదటి బోట్ తగలబడిన సమయం రాత్రి 11.15 గంటలుగా పోలీసులు గుర్తించారు. 11.45 గంటలకు నాని అక్కడకి వచ్చినట్టు మొబైల్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు. తన బోట్ కాలిపోతుందన్న సమాచారంతోనే అక్కడకు వెళ్లానని నాని పోలీసులకు తెలిపాడు. ఆ టైమ్‌లో నాని ఎటు వెళ్లాడు.. మొబైల్ లొకేషన్‌ను ఎక్కడ ఉంది అనే దానిపై కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తొలుత నాని చూట్టూ సాగిన విచారణ.. మళ్లీ క్రికెట్ బెట్టింగ్ వైపు మళ్లింది. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బెట్టింగ్ ముఠాల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి..విశాఖ షిఫింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం మొత్తం లోకల్‌బాయ్ నాని చుట్టూనే తిరుగుతోంది. మరి పోలీసులు చివరకు ఏం తేలుస్తారో చూడాలి.
ఇదిలాఉంటే.. అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లినట్ల అధికారులు పేర్కొంటున్నారు. చేపలతో పాటు 40 బోట్లు కాలిబూడిదయ్యాయి. అంతేకాకుండా మరో 40 బోట్లు ధ్వంసమైనట్లు పేర్కొంటున్నారు. కాగా.. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణకు ఆదేశించారు. మత్స్యకారులను ఆదుకోవాలని సూచించారు. కాగా.. కాలిన బోట్లకు సర్కారు పరిహారం ఇవ్వనుంది. విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని, మత్స్యకారులకి అండగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..