
ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం జిల్లాలో గత కొంతకాలంగా సాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్దపప్పూరు మండలంలోని పెన్నా నదిలోని ఇసుక రీచ్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
సెబ్, గనులు, భూగర్భ శాఖ, పోలీసు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గత వారం రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇసుక రీచ్ ను తన అనుచరులతో సందర్శించిన జెసి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం పైన, జిల్లా యంత్రాంగం పైన గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని జెసి ఆరోపించారు. ఇసుక రీచ్ ను పర్యవేక్షించాల్సిన మానిటరింగ్ కమిటీ లో కలెక్టర్ సహా 13 మందికి జెసి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా నోటీసులు పంపించారు. మనుషులతో తక్కువ మోతాదులో ఇసుక తరలించాల్సి ఉండగా యంత్రాలతో నిత్యం దోపిడీ జరుగుతుందని ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఎట్టకేలకు స్పందించిన జిల్లా యంత్రాంగం ఇవాళ తనిఖీలు చేపట్టింది.
మరోవైపు చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదిలోకి నీరు వదలడం అనుమానాలకు తెరలేపింది. అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా చాగల్లు డ్యామ్ గేట్లు ఎత్తివేయడం వివాదాస్పదంగా మారింది. ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోవడంతో అధికారుల తనిఖీలకు ఆటంకం ఏర్పడింది. నీళ్ళు ఎవరు వదిలారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం