
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సాలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రహరీ కూలి పదో తరగతి విద్యార్థి మృతి చెందడం సంచలనం సృష్టించింది. సాలూరులోని పెదహరిజనపేటకు చెందిన తుపాకుల అరుణ్ తేజ అనే విద్యార్థి జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత తోటి విద్యార్థి యాకూబ్‌తో కలిసి పాఠశాల ప్రహరీ గోడపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో.. అరుణ్‌తేజ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కూల్‌లో గోడ కూలి విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడు చనిపోయినా సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్ధి మృతిపై బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి మృతదేహాన్ని పాఠశాలకు తీసుకుని వెళ్లి అక్కడే బైఠాయించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆందోళనకు దిగారు.
మరోవైపు.. సాలూరులో విద్యార్థి మృతి, మరో విద్యార్థి గాయపడటం పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి సంధ్యారాణిని అడిగి తెలుసుకున్నారు. గోడ కూలి టెన్త్ విద్యార్థి మృతిచెందడం బాధాకరం అన్నారు మంత్రి లోకేష్. గాయపడ్డ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి లోకేష్ భరోసా కల్పించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..