ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఏడువేల మందికి పైగా ప్రాణాలుకోల్పోగా.. దాదాపు రెండు లక్షల మంది వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మనదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ కరోనా ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. 110మందకి పైగా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత సాధినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కోవడానికి ఒక పారసెటమల్ గోలీ చాలని సీఎం చెప్పడం సరికాదన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి పారసెటమాల్ వేసుకుంటే.. అది ప్రాణాలకే ముప్పు అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇక బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా వైరస్ చనిపోతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి తీసుకునే చర్యలకంటే ఎక్కువగా స్థానిక ఎన్నికలే ముఖ్యమనే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌కు కులం అంటగడుతూ.. ఏక వచనంతో సంబోధించడం సీఎంకు తగదన్నారు.