Rushikonda Palace: మీరే చెప్పండి.. రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దామంటారు.. ప్రజల‌కు చంద్రబాబు సర్కార్ బిగ్ ఆఫ‌ర్

మీరే చెప్పండి.. ఆ ప్యాలెస్‌ను ఏం చేయ‌మంటారు?!“- అంటూ.. ఏపీ ప్రజల‌కు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ఆఫ‌ర్ ఇచ్చింది. అంతేకాదు.. “మీ సూచ‌న‌లు, స‌ల‌హాలు మాకు అత్యంత కీల‌కం. ప్రతి ఒక్కరూ స్పందించాల‌ని కోరుతున్నాం. మెజారిటీ ప్రజ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కీల‌క నిర్ణయం తీసుకుంటాం అంటోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.

Rushikonda Palace: మీరే చెప్పండి.. రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దామంటారు.. ప్రజల‌కు చంద్రబాబు సర్కార్ బిగ్ ఆఫ‌ర్
Vizag Rushikonda Palace

Updated on: Oct 13, 2025 | 9:27 AM

విశాఖ‌లో ప్రముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా ఉన్న రుషికొండ‌లో వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో భారీ ఎత్తున నిర్మాణాలు చేశారు. వీటికి గాను రూ.452 కోట్లను అప్పటి జ‌గ‌న్ ప్రభుత్వం ఖ‌ర్చు చేసింది. ఈ నిర్మాణాల‌కు అత్యంత ఖ‌రీదైన మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చుకున్నారు. ఓపెన్ ప్లేస్ నుంచి పార్కింగ్ వ‌ర‌కు.. సువిశాలంగా నిర్మించారు. ఇక‌, టాయిలెట్ క‌మోడ్‌లు, డైనింగ్ హాల్స్ .. ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖ‌రీదైన వస్తువులనే వినియోగించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి రుషి కొండ‌పై ప్యాలెస్ అలానే ఉంది.. 16 నెలల క్రితం కూట‌మి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చినా.. దీనిని ఎలా వినియోగంలోకి తీసుకురావాల‌న్న విష‌యంపై ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. ఈ నేప‌థ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇక్కడ ప‌ర్యటించి.. నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. విశాఖకు ప్యాలెస్‌లు నిర్మించడానికి రాలేదు.. ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ప్రత్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ అధ్యయ‌నం చేసి.. రుషికొండ పై ఉన్న ఈ నిర్మాణాన్ని ఎలా వినియోగంలోకి తీసుకురావాల‌న్న విష‌యంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలోనే రుషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగిస్తే బాగుంటుందో చెప్పాలంటూ ప్రజల నుంచి ఏపీ పర్యాటకశాఖ సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి వెల్లడించారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.inకు మెయిల్‌ చేయాలని సూచించారు.

అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం కానున్నామన్న ఆమ్రపాలి.. వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. ఈ సలహాలు, అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించి. తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి వెల్లడించారు.మ‌రి ఆల‌స్యం ఎందుకు.. 450 కోట్ల రూపాయల విలువైన భ‌వ‌నాన్ని ఎలా వినియోగించాల‌ని భావిస్తున్నారో.. స‌ర్కారుకు మెయిల్ చేయండి. మీ స‌ల‌హా న‌చ్చితే.. దానిని అమ‌లు చేసేందుకు స‌ర్కారు సిద్ధంగా ఉంది. మెయిల్ చేయ‌ద‌లుచుకున్న వారు.. rushikonda@aptdc.inకు స‌మాచారం చేర‌వేయొచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..