తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో భారీగా వరదల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అన్ని ప్రాజెక్టులు జల కలను సంతరించుకున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల కావడంతో మంత్రాలయం దగ్గర ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దర్శనం కోసం వచ్చిన భక్తులు తుంగభద్ర నదికి స్నానాలకు వెళ్లొద్దని మఠం అధికారులు సూచించారు. వరద ఉధృతి మరింత పెరగడంతో నదిలో స్నానాలు నిలిపివేశారు. అటు వరద ప్రవహంలో విష సర్పాలు కూడా సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
అటు పశ్చిమగోదావరిజిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మాధవాయిపాలెం-సఖినేటిపల్లి రేవులకు రాకపోకలు నిలిచిపోయాయి. పేరుపాలెం బీచ్‌లో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. డేంజర్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3.35 లక్షలు, ఔట్ ఫ్లో 3.18 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు ఉండగా…ప్రస్తుత నీటి నిల్వ 6.325 టీఎంసీలుగా ఉంది.జూరాల కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి అవుతోంది.
జూరాల, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఇన్‌ఫ్లో 3,25,423 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు ఉండగా…ప్రస్తుత నీటిమట్టం 872.60అడుగులుగా ఉంది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.