Andhra: 3 సెంట్ల స్థలం.. రూ. 3.5 లక్షల పెట్టుబడి.. కౌజు పిట్టల పెంపకంతో సూపర్ సక్సెస్..

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజు, అనారోగ్యం కారణంగా తాపీ మేస్త్రి పనిని వదులుకుని, యూట్యూబ్ స్ఫూర్తితో కౌజు పిట్టల పెంపకం ప్రారంభించారు. కేవలం మూడు సెంట్ల స్థలంలో, రూ. 3.5 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలుపెట్టి, నిరంతర ఉత్పత్తి, మార్కెటింగ్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తూ స్వయం ఉపాధికి నిదర్శనంగా నిలుస్తున్నారు.

Andhra:  3 సెంట్ల స్థలం.. రూ. 3.5 లక్షల పెట్టుబడి.. కౌజు పిట్టల పెంపకంతో సూపర్ సక్సెస్..
Quail Farming

Updated on: Oct 03, 2026 | 2:01 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం మండలం, రుస్తుంబాద్ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు, ఒకప్పుడు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే, అనారోగ్య కారణాల వల్ల ఆయన తన వృత్తిని కొనసాగించలేకపోయారు. పని కోల్పోయి, ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పటికీ, రాజు నిరాశకు లోను కాలేదు. ఏదో ఒక మార్గంలో స్వయం ఉపాధిని సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్న రాజుకు, యూట్యూబ్ ఒక కొత్త మార్గాన్ని చూపింది. అక్కడే ఆయన కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకున్నారు. చిన్న పెట్టుబడితో, తక్కువ స్థలంలో మంచి మార్కెట్ ఉన్న ఈ పెంపకం తనకు సరిపోతుందని భావించిన రాజు, వెంటనే కార్యాచరణలోకి దిగారు. అనుకున్నదే తడువుగా మూడు సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు రూ. 3.5 లక్షల వ్యయంతో కౌజు పిట్టల పెంపకానికి అనువుగా ఒక షెడ్డును నిర్మించారు. ఈ షెడ్డును ఒకే గదిగా కాకుండా, పిట్టల పెరుగుదల దశలకు అనుగుణంగా మూడు చిన్న గదులుగా విభజించారు.

రాజు కౌజు పిట్టల పెంపకంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను అనుసరిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు వెయ్యి పిల్లలను పెంచుతున్నారు. ఒక బ్యాచ్ పూర్తిగా అమ్మకానికి సిద్ధమయ్యే సమయానికి, మరో బ్యాచ్ ఉత్పత్తికి సిద్ధంగా ఉండేలా నిరంతర ప్రణాళికను రూపొందించుకున్నారు. దీనివల్ల నిరంతరం ఉత్పత్తి, నిరంతరం మార్కెటింగ్, నిరంతరం ఆదాయం లభిస్తున్నాయి. పిల్లలను అత్తిలి నుండి తెచ్చుకుంటారు. ఒక్కో చిక్ ధర రవాణా ఛార్జీలతో కలిపి రూ. 8 అవుతుంది. పిల్లలను తెచ్చిన తర్వాత వాటికి బ్రూడింగ్ సౌకర్యం కల్పిస్తారు. మొదటి వారం నుండి పది రోజుల వరకు ‘ఫ్రీ స్టార్టర్’ ఫీడ్‌ను అందిస్తారు. ఇది పిట్టల ఆరోగ్యకరమైన పెరుగుదలకు, మోర్టాలిటీని తగ్గించడానికి చాలా ముఖ్యం. ఆ తర్వాత పదిహేను రోజుల పాటు ‘స్టార్టర్ ఫీడ్’ ఇస్తారు. ఈ పెంపకంలో మోర్టాలిటీని తగ్గించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా నష్టాలను నివారించవచ్చని రాజు చెబుతున్నారు. కౌజు పిట్టలు 28 రోజులలోనే మార్కెట్‌కు సిద్ధమవుతాయి. అయితే, మంచి చూపు, సరైన బరువు (100 గ్రాములకు పైగా) కోసం రాజు 32 నుంచి 34 రోజుల వరకు పెంచి, ఆ తర్వాత వాటిని కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన పిట్టలను కేజీకి పది పీసులు వచ్చేలా చూసుకుంటారు. ఒక ప్యాకెట్‌లో పది పీసులు, సుమారు కేజీ నుండి కేజీన్నర బరువు వచ్చేలా ప్యాక్ చేసి విక్రయిస్తారు. మార్కెటింగ్ విషయానికి వస్తే, రాజు తన ఉత్పత్తులను పాలకొల్లు నుండి బంటుమిల్లి వరకు విస్తరించిన మార్కెట్‌లో అమ్ముతున్నారు. హోటళ్లకు ఒక్కో పీస్‌ను రూ. 55 చొప్పున అమ్ముతుండగా, షాపునకు వచ్చి తీసుకునే కస్టమర్లకు జతకు రూ. 130 నుంచి రూ. 150 వరకు విక్రయిస్తారు. హోటళ్లకు ఏడాది పొడవునా ఒకే రేటు ఉంటుంది.

మాంసంతో పాటు, రాజు కౌజు పిట్టల గుడ్లను కూడా విక్రయిస్తున్నారు. 55 రోజులు దాటిన ఆడ పిట్టలు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఈ గుడ్లను ఒక్కొక్కటి రూ. 5 చొప్పున అమ్ముతారు. కౌజు పిట్టల గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల జిమ్ చేసేవారు, వైద్యుల సిఫార్సుతో వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వారానికి 300 నుంచి 400 గుడ్లు అమ్ముడవుతాయని రాజు తెలిపారు. రాజు విజయగాథ “పెద్ద భూమి కావాలి, భారీ పెట్టుబడి కావాలి” అనే ఆలోచనకు ఒక సమాధానం. స్థలం చిన్నదైనా, ఆలోచన పెద్దదైతే స్వయం ఉపాధికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అని ఆయన నిరూపించారు. ఆరోగ్యం సహకరించక పాత వృత్తిని వదిలేసిన రాజు నిరాశకు లోను కాకుండా, కొత్త దారిని ఎంచుకుని, ఉద్యోగం కోసం వెతకడం కాకుండా, ఉపాధిని మనమే సృష్టించుకోవచ్చని నిరూపిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us