
గుంటూరు జిల్లా తాడేపల్లి కొండలో నల్లగా ఒంటిపై మచ్చలతో ఉన్న నాలుగు కాళ్ల జంతువు చెంగు చెంగు మంటూ ఎగురుతూ కనిపించింది. అది ఒక్కసారిగా ఇంట్లోకి దూరడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మొదట ఆ జంతువు ఏంటో అన్న కంగారులో దూరంగా పారిపోయారు. అదే సమయంలో జనసమ్మర్ధం పెరిగిపోవడంతో ఆ జంతువు కూడా వారిని చూసి ఇళ్లలోకి వెళ్లి దాక్కోవడం మొదలు పెట్టింది. అయితే అర గంట గడిచిన తర్వాత స్థానిక యువకులు పారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఒక ఇంట్లో మెట్ల కిందకి దూరిన పునుగు పిల్లా పారిపోకుండా యువకులు అట్ట పెట్టెలు, బుట్టలు అడ్డుపెట్టారు. కొద్ది సేపటి తర్వాత పారెస్ట్ అధికారులు వచ్చి పునుగు పిల్లిని పట్టుకుని మంగళగిరి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పునుగు పిల్లి అంతరించి పోతున్న జీవుల్లో ఉందని ఇప్పుడు తాడేపల్లి కొండ ప్రాంతంలో కనపించడం ఆశ్చర్యంగా ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఒక్క పునుగు పిల్లే ఉండటం సాధ్యం కాదని మరికొన్ని ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
సాధారణంగా శేషచల అడవుల్లో పునుగు పిల్లులు ఎక్కువుగా ఉంటాయి. వీటి తైలంతోనే తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ చేస్తారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వీటిని సంరక్షించి శేషాచల అడవుల్లో వీటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. అటువంటి అరుదైన పునుగుపిల్లి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఈ అరుదైన జంతువుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..