
ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజల మనసులో పులస చేపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. “పుస్తెలమ్మయినా పులస తినాలి” అనే సామెత ఈ చేపకు ఉన్న అసాధారణ డిమాండ్‌ను, దాని అధిక ధరలను స్పష్టం చేస్తుంది. గోదావరిలో ఈదే పులస రుచి, దాని ప్రత్యేకతలు చాలా మందికి ఆసక్తిని కలిగిస్తాయి. వాస్తవానికి, పులస అనేది సముద్రంలో నివసించే హిల్సా ఇలీషా అనే చేప జాతికి చెందినది. సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస లేదా విలస అని పిలుస్తారు. ఈ చేప గుడ్లు పెట్టేందుకు సముద్రం నుంచి నదుల వైపు వలస వస్తుంది. ముఖ్యంగా గోదావరి నదిలోకి ఎదురు ఈది వచ్చే ఈ చేప, ఆ ప్రయాణంలో దాని శారీరక నిర్మాణం, రుచిలో చాలా మార్పులకు లోనవుతుంది. సముద్రం నుంచి మంచి నీటిలోకి వచ్చిన తర్వాత, దాని శరీరం గోదావరి నీటి రంగును సంతరించుకుంటుంది.
మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం, అసలు గోదావరి పులస గోదావరి నీటి రంగులో ఉంటుంది, అయితే ఇలస మాత్రం నెమలి ఈక రంగులో, అంటే నీలం రంగులో ఉంటుంది. ఇదే ఈ రెండు చేపల మధ్య ప్రధాన తేడా. గోదావరి నదిలోని చప్పనీరు పులస రుచిని పెంచుతుంది. సముద్రం నుంచి మంచి నీటికి రావడానికి చేప ఎదురీదినప్పుడు, దాని శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. ఈ కొవ్వు పదార్థాలు ముఖ్యంగా చేప పొట్ట భాగంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ పొట్ట ముక్కను తింటే నోట్లో పెట్టుకోగానే వెన్న ముక్కలా కరిగిపోతుందని చెబుతారు. చేపలపై పరిశోధనలు చేసిన పలువురు నిపుణులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. హిల్సా ఇలీషా జాతి చేపలు గుడ్లు పెట్టేందుకు మంచి నీటిలోకి వస్తాయని, ఆ సమయంలోనే వాటి శరీరంలో కొవ్వు అధికంగా ఉండి, అత్యంత రుచిని కలిగి ఉంటాయని వారు వివరించారు.
పులస చేపకు డిమాండ్ భారీగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. ఇది సంవత్సరానికి ఒకసారి, సాధారణంగా జూన్, ఆగస్టు నెలల మధ్య మాత్రమే లభిస్తుంది. ఇలస చేపలు ఏడాది పొడవునా దొరుకుతాయి. ఇటీవలి కాలంలో పులస చేపల లభ్యత బాగా తగ్గింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం, ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు రెండో, మూడో చేపలు లభ్యమయ్యాయి అంతే. యానాం చేపల మార్కెట్‌లో జరిగిన వేలంలో ఈ ఏడాది తొలి పులస 14 వేల రూపాయలు పలికింది. అరుదుగా లభించడం, దాని ప్రత్యేక రుచి కలగలిసి దీని ధరలను ఆకాశానికి పెంచాయి. అంతేనా పులస దొరికే తమకే ఇవ్వాలని చాలామంది జాలర్లకు అడ్వాన్సులు కూడా ఇస్తున్నారు. పులస కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, గోదావరి జిల్లాల సంస్కృతిలో ఒక భాగంగా మారింది. ఈ సీజన్లో బంధువులకు, హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులకు కొరియర్ ద్వారా లేదా బస్సుల ద్వారా పులస చేపను పంపించడం ఆనవాయితీ. గోదావరి పులస దొరకగానే ఒక బంగారం దొరికినట్టు భావిస్తారు. మార్కెట్‌లో కూడా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పులస రుచి చూడటం అనేది ఒక అనుభూతి, ఇది కేవలం ఒక చేపకు సంబంధించిన విషయం కాదు, అది గోదావరి నది జీవనానికి, ఆ ప్రాంత సంస్కృతికి ప్రతీక. దాని అరుదు, ప్రత్యేక రుచి దీనిని గోల్డెన్ చేపగా మార్చాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..