
నంద్యాల జిల్లా బస్సు ప్రమాదం మర్చిపోకముందే.. విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కలకలం సృష్టించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కాకుంటే.. భారీ ప్రమాదమే జరిగేది.
తాటి చెట్ల పాలెం హైవేపై ఘటన జరిగింది. ఒరిస్సా రిజిస్ట్రేషన్ తో పీ తులసి ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. ఈ మధ్యాహ్నం తర్వాత విజయనగరంలో బయలుదేరింది. విశాఖ మీదుగా బెంగళూరుకు వెళ్తోంది. బస్సు విశాఖలోని తాటి చెట్ల పాలెం సిగ్నల్ పాయింట్ లో ఆగింది. ఆ తర్వాత ఎన్ఏడి వైపు బయలుదేరింది. ఈ సమయంలో ఇంజన్ గేర్ బాక్స్ నుంచి.. దట్టంగా పొగలు రావడం మొదలయ్యాయి. అప్రమత్తం అయ్యే లోపే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతోపాటు ఇద్దరు డ్రైవర్లు. మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నారు.
పొగ మంటలు చెలరేగినట్టు గుర్తించిన డ్రైవర్.. అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈలోగా స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వాహందారులు కూడా ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఏసీ స్లీపర్ బస్సు కావడంతో ఎవరి సీట్లలో వాళ్ళు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. పొగ క్రమంగా బస్సులోకి వ్యాపించింది. దీంతో హుటాహుటిన ప్రయాణికులంతా బ్యాగులు తీసుకొని బస్సు బయటకు వచ్చారు. అప్పటికే దట్టంగా కమ్ముకున్న పొగతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణభయంతో బస్సు నుంచి బయటపడ్డారు ప్రయాణికులు.
ఈలోగా అప్రమత్తమైన డ్రైవర్లు బస్సులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు. ప్రయాణికులు అందరూ సేఫ్‌గా బయటపడడంతో అంతా ఊపిరిపిల్చుకున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత ప్రత్యామ్నాయ బస్సులో ప్రయాణికులను తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆర్టిఏ అధికారులు విచారణ ప్రారంభించారు. అదే రాత్రిపూట ప్రమాదం జరిగి ఉంటే పెనుముప్పు సంభవించేదని ప్రయాణికులంతా గుండెలు పట్టుకున్నారు.