
యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుని కొంతమంది విద్యార్ధులు పాఠాలు నేర్చుకుంటుంటే.. మరికొంతమంది చోరకళను అభ్యసించడంలో ఆరితేరుతున్నారు.. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం యూట్యూబ్‌లో బైక్‌లు చోరీ చేయడం ఎలా అన్న విద్యను అభ్యసించాడో చోరకళా శిఖామణి.. కేవలం ఒక్క పిన్నీసుతో బైక్‌లను స్టార్ట్ చేసి ఎత్తుకెళుతున్నారు అన్నదమ్ములు.. అందుకు ఇంకా ఈజీగా ఉండేందుకు తాళం వేయని బైక్‌లను టార్గెట్ చేసి సునాయాసంగా బైక్‌లను చోరీ చేస్తున్నారు.. ఇలా 11 బైక్‌లను చోరీ చేసిన ఇద్దరు దొంగలు.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో చోటు చేసుకుంది.
2025 నవంబర్ 29వ తేది సాయంత్రం 6 గంటల సమయములో ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పాతచెరువు తండాకు చెందిన తన బైక్‌ను ఆర్టీసీ ఆవరణలో పార్క్‌చేసి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు.. అదేరోజు రాత్రి తన బైక్ కనిపించడం లేదని పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఎక్కువగా బైక్‌లు చోరీకి గురవుతుండటంతో తాజాగా వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం డిఎస్‌పి నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి బైక్‌లను చోరీ చేస్తున్న ముఠాలపై నిఘా పెట్టారు. పుల్లలచెరువు ఎస్‌ఐ సంపత్ కుమార్, సిబ్బంది నేరం జరిగిన తీరును విశ్లేషిస్తూ, కేసును నిరంతరం రివ్యూ చేశారు. నేరం జరిగిన స్థలంలో సిసి కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ముద్దాయిల సమాచారాన్ని సేకరించి ఈరోజు పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామ శివార్లలో ఇద్దరు నిందితులు వేణు, సన్నీలను అరెస్ట్ చేశారు.. 10 లక్షల విలువైన మొత్తం 11 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేశ్‌పాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేణు, సన్నీ మద్యం ఇతర జల్సాలకు అలవాటు పడ్డారు. తమ సంపాదన సరిపోకపోవడంతో త్వరగా డబ్బు సంపాదించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హ్యాండ్ లాక్ వేయని బైక్‌లను చోరీలు చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశారు.. అందుకు యూట్యూబ్‌లో పిన్నీసుతో బైక్‌లను ఎలా స్టార్ట్ చేయాలో నేర్చుకున్నారు.. ఆ తరువాత ఇక చేతివాటం ప్రదర్శించి కేవలం పిన్నీసుతో 11 బైక్‌లను చోరీ చేశారు. ఇలా పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దొనకొండ, మార్కాపురం రూరల్, పాత గుంటూరు , పిడుగురాళ్ల, కారంపూడి, నాగార్జునసాగర్, తెలంగాణ, హాలియా బస్టాండ్ దగ్గర బైక్‌లను చోరీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని మార్కాపురం డిఎస్‌పి నాగరాజు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..