మీరు కోళ్ల ఫారం పెట్టాలనుకుంటే రూ.50 లక్షల రుణం.. అందులో 50 శాతం రాయితీ

కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పరిశ్రమల స్థాపనకు 50 శాతం సబ్సిడీతో రూ.50 లక్షల వరకు లోన్ ఇస్తుంది. ఈ పథకానికి అర్హులు ఎవరు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, డీపీఆర్ తయారీ, సిబిల్ స్కోరు ప్రాముఖ్యత, శిక్షణ అవశ్యకత వంటి సమగ్ర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం ...

మీరు కోళ్ల ఫారం పెట్టాలనుకుంటే రూ.50 లక్షల రుణం.. అందులో 50 శాతం రాయితీ
Poultry Farm Loan

Updated on: Mar 09, 2026 | 9:55 AM

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణంపై 50 శాతం రాయితీని పొందవచ్చు. కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలో మాంసం, పాలు, గుడ్డు ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

ఎవరికి రుణమిస్తారు?

ఈ పథకం కింద ఎవరైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో వ్యక్తిగత దరఖాస్తుదారులు, స్వయం సహాయ సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, రైతు సహకార సంఘాలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, అలాగే సెక్షన్ 8 కిందకు వచ్చే కంపెనీలు అంటే హేచరీలు, కోళ్ల పెంపక కేంద్రాలు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దేశంలోని జాతీయ బ్యాంకులు ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తాయి.

భూమి అవసరం ఎంత?

లోన్ తీసుకోవాలనుకునే వారి పేరిట కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. దానికి సంబంధించిన పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. ఒకవేళ సొంత భూమి లేకపోతే, కౌలుకు తీసుకున్న భూమిపై కూడా రుణం పొందవచ్చు. అయితే, ఈ సందర్భంలో భూమి యజమానులు మరియు దరఖాస్తుదారు కలిసి జాయింట్‌గా రుణం తీసుకోవాలి.

దరఖాస్తు విధానం…

ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్ (National Livestock Mission Portal)ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, మీరు ఏర్పాటు చేయదలచుకున్న కోళ్ల ఫారానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను రూపొందించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

అవసరమైన పత్రాలు:

ఆధార్ కార్డ్ , కోళ్ల ఫారం ఏర్పాటు చేయదలచుకున్న భూమి ఫోటో, భూమికి సంబంధించిన పత్రాలు, పాన్ కార్డ్ , ఓటర్ కార్డ్ , రుణం తీసుకోబోయే బ్యాంకులో మీ ఖాతాకు చెందిన రెండు క్యాన్సిల్డ్ చెక్కులు , మాండేటరీ ఫామ్ ,  చిరునామా ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం,  విద్యార్హతల పత్రాలు, శిక్షణ పొంది ఉంటే ఆ సర్టిఫికెట్, స్కాన్ చేసిన మీ సంతకం ఫోటో దరఖాస్తు చేసిన తర్వాత, లాగిన్ అయ్యి మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లాగిన్ కోసం మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దరఖాస్తు చేసే సమయంలోనే మీరు దేని కోసం రుణం తీసుకోవాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. డీపీఆర్, ఇతర పత్రాలను అందులోనే అప్‌లోడ్ చేయాలి.

డీపీఆర్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మీరు ఎన్ని కోళ్లతో ఫారం ప్రారంభించాలనుకుంటున్నారు, ఒక్కో కోడి పిల్లను కొనేందుకు ఎంత ఖర్చవుతుంది, దాని పోషణకు ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలన్నీ వాస్తవంగా, నిజాయతీగా పొందుపరచాలి. ఊహాజనిత అంచనాలు వేస్తే బ్యాంకర్లు దరఖాస్తును ప్రారంభ దశలోనే తిరస్కరించే అవకాశం ఉంది.

సిబిల్ స్కోరు ఇంపార్టెన్స్:

రుణం పొందాలంటే సిబిల్ స్కోరు (CIBIL Score) బలంగా ఉండటం అత్యవసరం. సిబిల్ స్కోరు సరిగా లేకపోతే ఏ బ్యాంకు కూడా రుణాలు మంజూరు చేయడానికి ముందుకు రాదు.

శిక్షణ ఉంటే చాల బటర్:  కోళ్ల పరిశ్రమ లాభదాయకమే అయినా ఒడిదొడుకులతో కూడుకున్నది. అందువల్ల ఈ రంగంలోకి ప్రవేశించే ముందు తగిన శిక్షణ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. కోళ్లు ఎలా పెంచాలి, వాటికి జబ్బులు రాకుండా ఎలా నివారించాలి, వాటి పోషణ ఎలా, కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి వంటి అంశాలపై ముందస్తు అవగాహన కలిగి ఉండటం విజయానికి దోహదపడుతుంది.

ఎవర్ని సంప్రదించాలి?

ఈ పథకం అమలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, రాష్ట్ర నోడల్ ఏజెన్సీల ద్వారానే దరఖాస్తులు మీ ప్రాంతంలోని బ్యాంకులకు వెళ్తాయి. మీ ప్రాంతంలోని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారిని లేదా వారి కార్యాలయాన్ని సంప్రదించి ఈ పథకం గురించి మరింత సమాచారం పొందవచ్చు. వారి సహాయంతో దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు.

Follow Us