వీళ్ల టైం అస్సలేం బాలేదు.. గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ కారుతో పోలీసులకే డ్యాష్‌! ఆ తర్వాత..

పోలీసుల కంట పడకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నఇద్దరు స్మగ్లర్లు నాటకీయంగా వాళ్లనే కారుతో ఢీ కొట్టారు. అనంతరం వాహనం ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంజాయి స్మగ్లర్లపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ షాకింగ్‌ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో..

వీళ్ల టైం అస్సలేం బాలేదు.. గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ కారుతో పోలీసులకే డ్యాష్‌! ఆ తర్వాత..
Marijuana Smuggling Gang

Updated on: Aug 17, 2025 | 5:50 PM

నెల్లూరు, ఆగస్ట్‌ 17: గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అయితే పోలీసుల కంట పడకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నవీరు నాటకీయంగా వాళ్లనే కారుతో ఢీ కొట్టారు. అనంతరం వాహనం ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గంజాయి స్మగ్లర్లపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ షాకింగ్‌ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నెల్లూరులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆదివారం (ఆగస్ట్‌ 17) తెల్లవారుజాము నుంచే నగరంలోని అన్ని రోడ్లపై కాపుకాశారు. ఇందులో భాగంగా ఎస్వీజీఎస్‌ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరానికి చెందిన బీకర ప్రకాష్‌ అలియాస్‌ సూర్యప్రకాష్‌ కారులో గంజాయి తరలిస్తుండగా రోడ్డుపై పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కంగారు పడిన స్మగ్లర్‌ వాహనంతో వేగంగా పోలీసులను ఢీకొట్టి.. అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

దాడిలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే బాలాజీనగర్‌ సీఐ సాంబశివరావు సర్వీస్‌ రివాల్వర్‌తో దుండగులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో స్మగ్లర్లు తోకముడిచి లొంగిపోయారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా.. అందులో దాదాపు 22 కేజీల గంజాయిని కనిపించింది. దీన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న ఈగల్‌ సెల్‌ ఐజీ రవి కృష్ణ, ఎస్పీ కృష్ణకాంత్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దాడిలో గాయాలపాలైన కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలపే అక్రమ రవాణా చేసినా, అమ్మకాలు సాగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దందా జోరుగా సాగుతుంది. ఇప్పటికే పలుమార్లు తనిఖీల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.